సాక్షి, మదనపల్లె : మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జనాభా ప్రాతిపదికన కాకుండా పూర్తిగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) టార్గెట్‌గా ‘రాజకీయ విభజన’గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
48 వార్డులతో కొత్త మున్సిపాలిటీ!
2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో 1,36,414 మంది జనాభా ఉండగా, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,66,988కు చేరింది. ఈ లెక్కన పాత 35 వార్డులకు తోడుగా కొత్తగా మరో 13 వార్డులను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 48కి చేరింది. కొత్త లెక్కల ప్రకారం ఒక్కో వార్డులో సగటున 3,478 మంది ఓటర్లు ఉండేలా మున్సిపల్ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. పాత 35 వార్డుల భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ఈ విభజన జరగడంతో పాత వార్డులన్నీ పూర్తిగా రద్దు అయినట్లేనని, ఇది ఇప్పుడు కొత్త మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని స్పష్టమవుతోంది.
’రౌండ్ ది క్లాక్’ తిరకాసు..
ఒకే ఇంట్లో ముక్కలైన ఓట్లు!
గతంలో చుట్టుపక్కల వీధులను కలిపి ఒక వార్డుగా చేసేవారు. కానీ ఇప్పుడు అధికారులు ’రౌండ్ ది క్లాక్’ (గడియారం తిరిగే) విధానాన్ని తెరపైకి తెచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉత్తరం ప్రాంతం నుంచి ప్రారంభించి.. తూర్పు, దక్షిణం, పడమర వైపుగా సాగుతూ ఓటర్ల సంఖ్య ఆధారంగా గీతలు గీసుకుంటూ పోయారు. చివరకు ఒకటో వార్డు ప్రారంభమైన ప్రాంతానికే వచ్చి చివరి వార్డుతో ముగించారు.
దీనివల్ల భౌగోళిక సరిహద్దులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. గతంలో ఒకే వార్డులో ఉన్న ప్రజలు ఇప్పుడు నాలుగైదు వార్డుల పరిధిలోకి ముక్కలైపోయారు. చివరకు ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లు కూడా రెండు, మూడు వేర్వేరు వార్డులకు విడిపోయే విచిత్ర పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.
ప్రతిపక్షాలే లక్ష్యంగా టీడీపీ కుట్ర!
మదనపల్లె మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ అడ్డదారిలో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి చైర్మన్ పదవిని దక్కించుకుంది తప్ప.. నేరుగా మెజార్టీ సాధించిన చరిత్రే లేదు. ఈ నేపథ్యంలో, అందివచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ తమకు అనుకూలంగా, వైఎస్సార్సీపీని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే విధంగా టీడీపీ నేతలు ఈ మున్సిపల్ వార్డుల విభజన చేయించుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
నేడే ’ఫామ్–11’ నోటిఫికేషన్..
అధికారిక ప్రక్రియ టైమ్‌లైన్ ఇదే!
మదనపల్లె మున్సిపాలిటీలో కొత్తగా నిర్ణయించిన కౌన్సిల్ వార్డులకు సంబంధించి ఆదివారం సాయంత్రం మున్సిపల్ అధికారులు ’ఫామ్–11’ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ రోజు నుంచే అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుండి 24 వరకు: కొత్త వార్డుల విభజనపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల (జూన్) 5 వరకు: ప్రజల నుంచి అందిన సూచనల వివరాలతో కూడిన జాబితాను అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారు. జూన్ 6 నుండి 11 వరకు: కలెక్టర్ దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి మున్సిపల్ డీఎంఏకు నివేదిస్తారు. అనంతరం ఆ నివేదిక మున్సిపల్ శాఖ ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. జూన్ 12 నుండి 23 వరకు: ప్రభుత్వం ఈ నివేదికను తుదిసారిగా పరిశీలించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. ఈ తికమక, రాజకీయ విభజనపై వైఎస్సార్సీపీ మరియు స్థానిక ప్రజలు అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఏ విధంగా పోరాడతారో వేచి చూడాలి.
మదనపల్లెలో ‘రాజకీయ’ విభజన!
‘రౌండ్ ది క్లాక్’ కుట్రతో పాత 35 వార్డులు రద్దు
48 స్థానాలతో కొత్త మున్సిపాలిటీ!
వైఎస్సార్సీపీని దెబ్బతీసేందుకే
సరిహద్దుల మార్పు
టీడీపీ నేతల అడ్డదారి వ్యూహం
నేడే ‘ఫామ్–11’ నోటిఫికేషన్
18 నుంచి అభ్యంతరాల స్వీకరణ!


