సాక్షి టాస్కపోర్స్: ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లి పంచాయతీ, వడ్డిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార పార్టీ నాయకుడు ఆక్రమించినట్లు అదే గ్రామానికి చెందిన చల్లా చంద్ర శేఖర్ అనే వ్యక్తి కడప జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు..వడ్డిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 158 లో ఉన్న 1 ఎకరా 86 సెంట్ల ప్రభుత్వ భూమిని కొంత కాలంగా ఆక్రమించి ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకుడైన గడ్డెం సుబ్బారెడ్డి నుంచి కాపాడాలని విన్నవించారు. కబ్జా దారుడైన స్థానిక గెడ్డెం సుబ్బారెడ్డికి సర్వే నంబర్ 157లో 0.93 సెంట్ల సొంత భూమి ఉంది, అయితే అదే సర్వే నంబర్‌కు ఆనుకుని ఉన్న 158 సర్వే నంబర్‌లో దాదాపు 100 సంవత్సరాలుగా వడ్డె కులస్తుల అనుభవంలో ఉన్న 1 ఎకరా 86 సెంట్ల గ్రామకంఠాన్ని గడ్డెం సుబ్బారెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా అక్రమించుకొని, తన భూమిలో కలుపుకున్నాడన్నారు. ఇదే కాకుండా సదరు గ్రామానికి అనుకుని ఉన్న పలు ప్రభుత్వ భూములు, గ్రామకంఠాల స్థలాలను అధికార పార్టీ ముఖ్య నాయకుడి అండ చూసుకొని, దాదాపు 8ఎకరాల వరకు గడ్డెం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో ఆక్రమించినట్లు ఫిర్యాదు దారుడు తెలిపాడు.అక్రమించుకున్న ప్రభుత్వ భూములు, గ్రామకంఠాలను చదును చేసి కొన్ని చొట్ల కంచెను వేయగా, మరికొన్ని చోట్ల చెట్లను నాటి సాగు చేసుకుంటున్నాడని ఫిర్యాదు దారుడు చల్లా చంద్ర శేఖర్ పేర్కొన్నారు. కబ్జా రాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.


