వ్యర్థ రహిత మదనపల్లెగా తీర్చిదిద్దుతాం
మదనపల్లె: సాంకేతికతతో మునిసిపల్ వ్యర్థాలను నిర్వహించి వ్యర్థ రహిత మదనపల్లె పట్టణంగా తీర్చిదిద్దుతామని, ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జీరో వేస్ట్ లిట్టర్ నినాదంతో మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలన్నారు. డంపింగ్ యార్డులో తొమ్మిది ఎకరాల్లో వ్యర్థ పదార్థాలను ప్రాసెస్ చేసి మామిడి తోటలను పెంచుతున్నామన్నారు. త్వరలో మిగిలిన డంపింగ్ యార్డులో వ్యర్ధాలు లేకుండా చేసి మునిసిపల్ పార్కుగా మారుస్తామని వెల్లడించారు. త్వరలో కొరత ఉన్న మునిసిపల్ కార్మికుల నియామకం కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కమీషనర్ ప్రమీల, అధికారులు పాల్గొన్నారు.
బీటీ కళాశాల మైదానానికి వసతులు
స్థానిక బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో ప్రజలకు వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదానంలోకి ఎంతోమంది యువతీ యువకులు, వృద్ధులు వస్తారని, అందుకు తగినట్లుగా వసతులతో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ఏయే పనులు, వసతులు అవసరమో సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


