భక్తజనానికి సంబరం!
కడప సెవెన్‌రోడ్స్: తిరుమలేశుడి సన్నిధికి ఆయన క్షేత్రమే తొలిగడప. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే తిరుమల వెంకన్నకు చెందుతాయని భక్తుల్లో గొప్ప నమ్మకం. జిల్లా ప్రజలు ఆయనను తమ ఆరాధ్య దైవంగా తరతరాలుగా సేవిస్తున్నారు. ఈ ఆలయానికి అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి. జిల్లాలో జరిగే అతి పెద్ద తిరునాల ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలకు పేరుంది. మరి ఇంతటి ఘనచరిత కలిగిన స్వామికి బ్రహ్మోత్సవాలంటే ఊరంతా ఉత్సాహంగా ఉండడం సహజమే కదా!
● ఆదివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిగా, కడప రాయుడిగా భక్తులచే కొనియాడబడే ఆయన బ్రహ్మోత్సవాలంటే జిల్లా వాసుల్లో ఎనలేని ఉత్సాహం ఉంటుంది. వారం రోజులపాటు ప్రతిరోజు ఓ అలంకారంలో తమ ఇష్టదైవాన్ని చూసుకోవాలని ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కల్యాణోత్సవం నాడు కళ్లింతలుగా చేసుకుని స్వామి, అమ్మవార్లను మనసారా దర్శించుకుంటారు. రథోత్సవం నాడు స్వామి సాక్షాత్తు ఆకాశం నుంచే దర్శనమిస్తున్నాడని భావిస్తూ రథంపైనున్న స్వామికి రెండు చేతులెత్తి గోవిందనామ స్మరణలు చేస్తూ దర్శించుకుంటారు.
నేటి నుంచి ఉత్సవాలు
తిరుమలకు తొలిగడపగా భక్తులు భావించే దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ వారం రోజులపాటు విశేష పూజోత్సవాల నిర్వహణకోసం స్థానిక అర్చక బృందం సిద్దమైంది. ఇప్పటికే ఆలయాన్నంతా కన్నుల పండువగా అలంకరించారు. రంగురంగుల ముగ్గులు తీర్చారు. ఆలయంతోపాటు దేవునికడప గ్రామమంతా విద్యుద్దీపాలను అలంకరించారు. ఇటు కృష్ణాసర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపుల సీరియల్ సెట్లు అలంకరించి ఆలయం నుంచి మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. ఆలయంలో జరుగుతున్న పూజోత్సవాల గురించి వీటి ద్వారా నగర వాసులకు నేరుగా ప్రసారం అయ్యే అవకాశం కల్పించారు.
భక్తుల సౌకర్యం కోసం
ఈ సంవత్సరం దేవునికడప తిరునాలను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యారు. జేఈఓ వీరబ్రహ్మం శనివారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ఉత్సవాల నిర్వహణపై అవసరమైన సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో దేవునికడప గ్రామమంతా ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నాడు స్వామి వారిని కొలువుదీర్చేందుకు తేరును కూడా అందంగా ముస్తాబు చేసి సిద్ధం చేశారు. ఉత్సవ పూజలు నిర్వహించేందుకు అర్చక బృందం సన్నాహాలు చేస్తోంది.


