గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే
● పది రోజుల్లో సగానికిపైగా
పడిపోయిన ధరలు
● సాగు పెట్టుబడి వచ్చేది కూడా అనుమానమే
● ముఖం చాటేస్తున్న వ్యాపారులు
గుర్రంకొండ : ఈ ఏడాది గెనుసుగడ్డల(చిలకడ దుంప) సాగు రైతులకు బెంగే మిగిలింది. టమాటా, కూరగాయాలు, పూల సాగుతో నష్టపోయిన రైతులకు ప్రస్తుతం గెనుసుగడ్డల సాగు నష్టాలను మిగిల్చింది. జిల్లాలో ఈ ఏడాది గెనిసిగడ్డల సాగు విస్తారంగా చేపట్టారు. పది రోజుల క్రితం కిలో గడ్డలు రూ.17 వరకు ధరలు పలికాయి. అయితే ఒక్కసారిగా ధరలు పతనమై ప్రస్తుతం మార్కెట్లో కిలో గెనిసిగడ్డలు ధర కిలో రూ. 8.30 వరకు పలుకుతున్నాయి. ఈ ఏడాది పంట సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చేది అనుమానంగా మారింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో 1850 ఎకరాల్లో సాగు
జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు 1850 ఎకరాల్లో ఈ ఏడాది గెనుసుగడ్డల సాగు చేపట్టారు. గెనుసుగడ్డల సాగుకు రబీ సీజన్ అనుకూలం. పంటను సాగు చేసి ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. సాధారణంగా అక్టోబర్ నుంచి జనవరి వరకు గడ్డలసాగు ఉంటుంది. దుక్కుల దగ్గర నుంచి తీగెల నాటడం, ఎరువులు, కూలీలు, పంట చేతికొచ్చే వరకు మొత్తం సాగు ఖర్చు రూ.80 వేల వరకు ఉంటుంది. చీడపీడలు, రసాయనిక ఎరువుల వాడకం ఖర్చులు తక్కువగా ఉంటాయి. కూలీల అవసరం ఎక్కువగా ఉండదు. మొదట గెనుసుగడ్డల తీగెలు నాటే సమయంలోనూ, ఆ తరువాత పంట అదనుకొచ్చిన తరువాత గడ్డల పొలంలో నుంచి గడ్డలు తవ్వి బయటకు తీసేందుకు మాత్రమే కూలీల అవసరం ఉంటుంది. సాగుకు పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉన్న పంట ఇదే కావడం గమనార్హం.
ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రమే
ఈ ఏడాది గెనుసుగడ్డల సాగు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. ఎకరం పంటకు సాధారణంగా 11 నుంచి 13 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. వీటితోపాటు వైరస్‌లు సోకడంతో పలు మండలాల్లో దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. సగటున 6.70 నుంచి 8 టన్నుల వరకే దిగుబడి రావడం గమనార్హం. వీటిని గోనెసంచుల్లో నింపి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఒక గోనెసంచిలో 65 కిలోల గెనుసుగడ్డల నింపుతారు. ఎకరానికి ప్రస్తుతం 103 నుంచి 135 గోనెసంచుల వరకు గడ్డల దిగుబడి వచ్చిది. గతంలో అయితే ఎకరానికి 160 నుంచి 200 గోనె సంచుల గడ్డల దిగుబడి వచ్చేది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 25 నుంచి 35 శాతం మేరకు పంట దిగుబడి తగ్గిపోయింది.
ప్రస్తుతం కిలో ధర రూ.7.50 నుంచి రూ.8.30
పది రోజుల వ్యవధిలోనే మార్కెట్‌లో గెనుసుగడ్డల ధరలు సగానికి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పది రోజుల కిందట మార్కెట్లో కిలో గడ్డల ధర రూ.16 నుంచి రూ.17 వరకు పలికాయి. మొదటి రకం గడ్డలు కిలో ధర రూ.17, రెండవ రకం రూ.15, మూడవ రకం కిలో రూ.13 వరకు ఽమార్కెట్లో ధర పలికాయి. అయితే మార్కెట్లో గెనిసి గడ్డల ధరలు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం కిలో గడ్డల ధర రూ.8.30 లోపే ఉండటం గమనార్హం. ఈ లెక్కన ఎకరాకు రూ.56 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. దీంతో పంట సాగు, పెట్టుబడి ఖర్చు లెక్కిస్తే రైతుకు నష్టాలే మిగిలుతున్నాయి. వీటికితోడు మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చు, కమీషన్లు లెక్కిస్తే రైతులు భారీగానే నష్టపోతున్నారు.
అడ్వాన్స్‌లు ఇచ్చినా..
ప్రస్తుతం గెనుసుగడ్డల ధరలు పతనం కావడంతో వ్యాపారులు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో గడ్డల ధరలు ఆశాజనకంగా ఉంటే వ్యాపారులు రైతుల పొలాల వద్దకు వచ్చి ముందుగా అడ్వాన్స్‌లు చెల్లిస్తారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వ్యాపారులు అడ్వా న్స్‌లు చెల్లిస్తుంటారు. పది రోజుల క్రితం వరకు జిల్లాలో ఇదే తంతు కొనసాగింది. ప్రస్తుతం సగానికిపైగా ధరలు తగ్గిపోవడంతో మార్కెట్‌లో గడ్డలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు అడ్వా న్స్‌లు చెల్లించినా గడ్డల కొనుగోలు పొలాల వైపు రాలేదని రైతులు అంటున్నారు. కొంత మంది రైతు లు రోజుల తరబడి వ్యాపారులను అడుక్కొంటూ బలవంతంగా గడ్డలు కట్టబెడుతుండడం గమనార్హం. పది రోజుల క్రితం కుదుర్చుకొన్న ధరలు కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే కూడా తక్కువకే రైతులు వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు. మరి కొంత మంది రైతులు వ్యాపారులు రాకపోవడంతో తామే స్వయంగా బెంగుళూరు మార్కెట్‌కు గడ్డలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
బయటి రాష్ట్రాలకు తరలుతున్న గడ్డలు
జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో సాగు అయ్యే గెనుసుగడ్డలు బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం గెనుసుగడ్డలను బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ మార్కెట్లకు తరలిస్తున్నారు. మన రాష్ట్రంలో కడప, తిరుపతి, గుంటూరు, విజయవాడ పట్టణాల్లోని మార్కెట్లకు తరలిస్తుంటారు. బయటి రాష్ట్రాల నుంచి కొంత మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి పొలాల దగ్గరే గెసిగడ్డలను రైతుల నుంచి కొనుగోలు చేసి తరలిస్తుంటారు.
గ్రీసు తయారీలో వినియోగం
ఇక్కడ సాగు చేసే గెనుసుగడ్డలను ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రీసు తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. బయటి రాష్ట్రాల్లోని మార్కెట్లలో గెనిసిగడ్డలను తినడానికి వినియోగంచడంతోపాటు గ్రీసు తయారీకిగానూ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. అన్ని రకాల వాహనాలకు అవసరమైన అన్ని రకాల గ్రీసు తయారీలో వీటిని వినియోగిస్తుండడం గమనార్హం. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన ఫ్యాక్టరీ యాజమానులు వ్యాపారుల ద్వారా గెనిసిగడ్డలను కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు.
నష్టాలే మిగిలాయి
ఈ ఏడాది గెనుసుగడ్డల సాగుతో మాకు నష్టాలే మిగిలాయి. ఎకరం పొలంలో గెనుసుగడ్డల పంట సాగు చేశాను. ఎకరానికికంతా కలిపి 103 సంచుల దిగుబడి వచ్చింది. చిన్నసైజు గడ్డలను వ్యాపారులు వద్దనడంతో పక్కనే పారబోశాము. మార్కెట్లో ఇప్పుడున్న ధరలు చూస్తే బాధగా ఉంది. గత నెలలో ధరలు బాగుండేవి. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో దారుణంగా నష్టపోతున్నాము. కనీసం పంట సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. –అన్నయ్య, రైతు, సంగసముద్రం
వ్యాపారులు రావడం లేదు
గెనుసుగడ్డలు కొనడానికి వ్యాపారులు రావడం లేదు. పది రోజుల కిందట అడ్వాన్స్‌లు ఇచ్చినా ఇప్పుడు గడ్డలను తీసుకెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఎన్నోమార్లు బతిమిలాడితేగానీ వ్యాపారులు వచ్చి గడ్డలను మార్కెట్‌కు తీసుకెళ్లడం లేదు. పది రోజులు ముందు కుదుర్చుకొన్న ధరల కంటే చాలా తక్కువకే గడ్డలను వ్యాపారులకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ప్రశ్నిస్తే వ్యాపారులు గడ్డలు కొనడానికి రావడం లేదు.
– మల్లికార్జున, రైతు, కొత్తపల్లె
గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే
గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే
గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే
గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే
గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే


