ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై అమలు చేయాల్సిన కార్యాచరణపై శనివారం కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సమీక్షించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్, దాని క్రమబద్ధీకరణపై రూట్లు, రద్దీపై సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారు లు, బస్ రూట్లు, పార్కింగ్, ఆక్రమణలు, వన్–వే విధానాన్ని పోలీసు అధికారులు వివరించారు. పట్టణంలోకి భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు, లారీల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించడం జరుగుతుందని, దీన్ని నియంత్రించేందుకు పట్టణ శివారులో బస్సుల పార్కింగ్‌కు స్థలాలను గుర్తించాలని, కడప, రాయచోటి, తిరుపతి, బెంగళూ రు మార్గాల నుంచి వచ్చే బస్సులకు వేరే మార్గా లు కేటాయిస్తే ఫలితం ఉంటుందని చర్చించారు. నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్య రహదారుల్లో అక్రమం తొలగింపు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలపై ఆంక్షలు విధింపు డివైడర్లు ఏర్పాటు, కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్ద ప్రవేశం, ఎగ్జిట్ నియంత్రణపై సమీక్షించారు. మదనపల్లె నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ బస్సులు ప్యాసింజర్లను ఎక్కించుకునే పాయింట్లు తగ్గించుకునేలా చూడాలని నిర్ణయించారు. బైక్ పార్కింగ్ పై నియంత్రణ, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు, ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించి కొత్త ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డీఎస్పీ ఎస్.మహేంద్ర, ట్రాఫిక్ సిఐ గురునాథ్, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు రాజారెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.


