శతాధిక విశ్రాంత హెచ్‌ఎం మృతి
పుంగనూరు : శతాధిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న బోర్డు స్కూల్ విశ్రాంత హెచ్‌ఎం డీడీ బ్లెస్సింగ్స్(101) అనారోగ్యంతో శనివారం వేకువజామున మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శతాధిక సంవత్సరాలు పూర్తి చేసుకుని వేలాది మందికి విద్యనేర్పిన ఉపాధ్యాయురాలు మృతి చెందడం కలచివేసిందన్నారు. కాగా పట్టణంలోని చర్చి వీధిలో నివాసం ఉన్న ఆమె గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమెకు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె శిష్యబృందం పలువురు హాజరై భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలు సాయంత్రం కన్నీటి వీడ్కోలుతో నిర్వహించారు. ఆమె మృతి పట్ల మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ అమ్ముతోపాటు పలువురు క్రైస్తవ మతపెద్దలు సంతాపం తెలిపారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరికి గాయాలు
రొంపిచెర్ల : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు తీవ్రంగా గాయ పడిన సంఘటన రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెంచెంరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ లంకిపల్లెవారిపల్లెకు చెందిన శివయ్య(32) ద్విచక్ర వాహనంలో రొంపిచెర్లకు వెళ్లి తిరిగి స్వగ్రామం లంకిపల్లెవారిపల్లెకు పయనమయ్యాడు. రొంపిచెర్లకు చెందిన గిరి చెంచెంరెడ్డిగారిపల్లెకు పని మీద వెళ్లి తిరిగి రొంపిచెర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివయ్య కుడి కాలు విరిగింది. దీంతో స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స కోసం అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్ష చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. శివయ్య భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్‌ఐ మధుసూథన్ తెలిపారు.
లారీ ఢీకొని..
మదనపల్లె రూరల్ : లారీ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. బాబూకాలనీకి చెందిన డ్రైవర్ శంకరయ్య(65) వ్యక్తిగత పనులపై నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్ వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేందుకు ద్విచక్రవాహనంలో మార్కెట్‌యార్డులో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంతాపం
శతాధిక విశ్రాంత హెచ్‌ఎం మృతి


