ఏరులై పారిన మద్యం!
జిల్లాకు మూడోస్థానం....
మద్యం విక్రయాలలో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో మూడోస్థానాన్ని దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి అట్టడుగుస్థాయికి చేరినా మద్యం విక్రయాలలో మాత్రం మందుబాబుల పుణ్యమా అని పురోగతిని సాధించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో పాడేరు, సత్యసాయి జిల్లాలు తొలి రెండు వరుసలలో ఉండగా అన్నమయ్య జిల్లా రూ. 49.64 కోట్లు మద్యం విక్రయంతో మూ డోస్థానాన్ని చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాయచోటి: మద్యం తాగితే ఆరోగ్యానికి చేటంటున్నా మందు బాబులు అస్సలు ఆగటం లేదు. పైగా న్యూ ఇయర్ ప్రారంభం నుంచి అన్నమయ్య జిల్లాలో మద్యాన్ని మందు ప్రియులు తెగ తాగేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల్లోనే జిల్లాలో రూ. 5 కోట్లు విలువగల మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ అధికారులు లెక్కగట్టారు. దీంతో జిల్లాలో జనవరి ఒకటోతేది నుంచి 14వ తేది వరకు రూ. 49.64 కోట్లు విలువగల మద్యం విక్రయాలు జరిగినట్లు తేల్చారు. 14 రోజులలో 77,096 కేసుల మద్యం, 26, 134 కేసులు బీరు అమ్మకాలు జరిగాయి. ఇందులో 14వ తేది ఒక్కరోజే మూడు రోజులకు సరిపడా రూ. 4 కోట్లు విలువ గల మద్యాన్ని డిపో నుంచి దుకాణాలకు తరలించారు. ముందువారి దగ్గర ఉన్న స్టాక్‌తో కలిపి మూడురోజుల్లో రూ. 5 కోట్లు మద్యాన్ని మందు బాబులు తాగేశారని అధికారులు వివరిస్తున్నారు. పండుగ సందర్భంగా మందు బాబులకు అవసరమైన బ్రాండ్ల కొనుగోలులో మద్యం దుకాణాల దగ్గర జనం బారులు తీరి కనిపించారు.
52 శాతం అధికం: మద్యం విక్రయాలలో గత ఏడాది 14 రోజులలో విక్రయించిన మద్యం కంటే ఈ ఏడాది 14 రోజులలో 52 శాతం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 14 రోజులలో 43,327 కేసులు మద్యం, 27060 కేసులు బీరు విక్రయాలతో రూ. 32.63 కోట్లు రాబడి ఉండగా ఈ ఏడాది 14 రోజులలో రూ. 49.64 కోట్లు మద్యం విక్రయమైంది. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత తెచ్చిన నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా లైసెన్సులు పొందిన దుకాణాదారులు లైసెన్సు దుకాణాలతోపాటు బెల్టుషాపుల నిర్వహణను భారీస్థాయిలో చేపట్టారు. లైసెన్సు మద్యం షాపులలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయిస్తుండగా బెల్టుషాపులలో బాటిల్‌పై రూ. 10 నుంచి రూ. 50 వరకు అదనపు చార్జీలతో విక్రయాలు సాగిస్తూ మందు బాబుల జేబులలోని చిల్లరను కొల్లగొడుతున్నారు. పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాలలో స్థిరపడిన వారు స్వగ్రామాలకు చేరుకొని బంధువులు మిత్రులతో పెద్దఎత్తున పార్టీలు చేసుకోవడంతో మద్యం ఏరులై పారింది.
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో రూ. 5 కోట్ల మద్యం విక్రయం
గత ఏడాది కంటే ఈ ఏడాది 52 శాతం అధికంగా విక్రయం
విందులు, వినోదాలతో చిందులు
మద్యం విక్రయాలలో రాష్ట్రంలోనేఅన్నమయ్యకు మూడోస్థానం


