హార్సిలీహిల్స్‌లో ‘టూరిస్ట్ పోలీసు’ మూత !
● పర్యాటకుల భద్రతకు భరోసా ఇస్తూ 2023లో ప్రారంభం
● బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానం
● సిబ్బంది కొరతతో మూత
గతంలో చూడని, జరగని విధంగా టూరిస్ట్ పోలీసు విధానం అమలు చేసి పర్యాటకులు, యాత్రికుల భద్రతకు అదనపు టూరిస్ట్ పోలీస్‌స్టేషన్లను ప్రారంభించడం పోలీసు సంస్కరణల్లో సువర్ణాధ్యాయం
2023 ఫిబ్రవరి 14న ప్రారంభోత్సవంలో
అప్పటి సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
బి.కొత్తకోట : పర్యాటక ప్రాంతాలను సందర్శించే యాత్రికుల భద్రతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టూరిస్ట్ పోలీసు కేంద్రాలను 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాల్లో ప్రారంభించారు. ఇందులో బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై ఏర్పాటుచేసిన టూరిస్ట్ పోలీసు (ఔట్‌పోస్టు పోలీస్‌స్టేషన్)ను వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవం చేశారు. ఈ విధానం ద్వారా పర్యాటకులకు భద్రత, భోరసా కలుగుతుందని ఆకాంక్షించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ టూరిస్ట్ పోలీసు విధానం అటకెక్కింది. బ్రిటిష్ పాలనలోనే హార్సిలీహిల్స్‌లో ఔట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌ను నిర్మించి ప్రారంభించారు. తర్వాత ఇది మూతపడగా టూరిస్ట్ పోలీసు కేంద్రాన్ని ఇందులోనే ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ మూతపడింది.
భధ్రతకు భరోసా ఏదీ
రాష్ట్రంలో ప్రత్యేకంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో హార్సిలీహిల్స్ టూరిస్ట్ పోలీసు కేంద్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై పనిచేసేలా విధులను రూ పొందించారు. ఈ కేంద్రంలో ఆరుగురు పోలీసులు షిఫ్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తే.. ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు పర్యవేక్షిస్తారు. సందర్శకులకు కనిపించేలా ప్రత్యేక ఫోన్ నంబర్ బోర్డులపై రాశారు. విధుల్లోని సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం ఇచ్చారు. వీరికి హార్సిలీహిల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇక్కడ ప్రదేశాలపై అవగాహన కల్పించారు. పర్యాటకులు భయం లేకుండా విడిది చేసేలా టూరిస్ట్ పోలీసు భరోసా ఇచ్చింది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్సలు అందించడం, విపత్కర, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకునేలా విధుల్లోని సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే ప్రస్తుతం దీని నిర్వహణ ఆగిపోయింది. విధుల్లో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడంతో పర్యాటకుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల హార్సిలీహిల్స్‌పై ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది లేకపోవడంవల్ల సందర్శకుల్లో ఆభద్రతాభావం నెలకొంటోంది.
ఆశ..నిరాశ
హార్సిలీహిల్స్‌పై బ్రిటిష్‌హయాం నుంచి పోలీస్‌స్టేషన్ ఉంది. దీనికోసం స్టేషన్ భవనం నిర్మించి, విధులు నిర్వహించే సిబ్బందికి ఇళ్లను నిర్మించారు. 2002 వరకు ఒక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేవారు. గవర్నర్లు, సీఎంలు, మంత్రులు, ప్రభుత్వస్థాయి అధికారులు విడిది చేసినప్పుడు, పర్యటనలకు భద్రత కల్పించడం జరిగేది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది స్థానంలో కొంతకాలం మొబైల్ పోలీసులను నియమించారు. 2023లో టూరిస్ట్ పోలీసు విధానం రావడంతో కొండపై భద్రత పెరిగిందని పర్యాటకులు భావించారు. అయితే మళ్లీ పాతరోజులే పునరావృతం అయ్యాయి. భద్రతపై సీఐ కే.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉందన్నారు. దీంతో నిత్యం ఇద్దరు కానిస్టేబుళ్లతో భద్రత నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విద్యార్థి పురుషోత్తం లోయలో పడిపోగా తక్షణమే స్పందించి తీరును వివరించారు.
హార్సిలీహిల్స్ టూరిస్ట్ పోలీసు కేంద్రం.వర్చువల్ పద్దతిలో నాటి సీఎం వైఎస్.జగన్ టూరిస్ట్ పోలీసును ప్రారంభించాక, శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎస్పీ హర్షవర్దన్‌రాజు
హార్సిలీహిల్స్‌లో ‘టూరిస్ట్ పోలీసు’ మూత !


