గ్యాస్ సిలిండర్ పేలి కౌన్సిలర్‌కు తీవ్రగాయాలు
మైదుకూరు : మైదుకూరు పట్టణంలో గ్యాస్ సిలిండర్ పేలి మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల వెంకటసుబ్బన్నకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న వెంకటసుబ్బన్న బుధవారం రాత్రి దోమల బాధ తాళలేక దోమల నివారణ కోసం వాడే అగరబత్తీని వెలిగించేందుకు అగ్గిపుల్లను వెలిగించాడు. అప్పటికే వంట గదిలో గ్యాస్ లీక్ అవుతున్న సిలిండర్‌ను గమనించకపోవడంతో ఒక్క సారిగా మంటలు లేచి సిలిండర్ పేలింది. మంటల్లో చిక్కుకున్న వెంకటసుబ్బన్నకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స కోసం ఆయనను కడప రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మైదుకూరు మొదటి పురపాలక ఎన్నికనల్లో 7వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన వెంటసుబ్బన్న, రెండో దఫా కూడా పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


