కనుల పండువగా గోదా కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా గోదా కల్యాణం

Jan 15 2026 9:55 AM | Updated on Jan 15 2026 9:55 AM

కనుల

కనుల పండువగా గోదా కల్యాణం

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలో కొండపై గల శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో బోగి పండుగను పురస్కరించుకుని బుధవారం శ్రీ గోదాదేవి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ మహా విష్ణువు అంశయైన శ్రీ చెన్నకేశవస్వామికి, శ్రీ మహా లక్ష్మిదేవి అంశయైన గోదాదేవికి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ మండపంలోని వేదికపై అలంకార భూషితులైన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ గోదాదేవిలు ఆశీనులవగా మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. మొదట రక్షా సూత్రధారణ, కణ్యా వరుణ విశేషార్చన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంప్రదాయ బద్దంగా సాగిన పాద ప్రక్షాలనం, మాంగళ్య పూజలు భక్తులకు ఆనందాన్ని కలిగించాయి. వైభవోపేతంగా జరిగిన మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాలను చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్బంగా కొండ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా తెల్లవారు జామున ధనుర్మాస ప్రాతఃకాల పూజను నిర్వహించారు. ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

కడప అర్బన్‌ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఈ తరం వారికి గుర్తు చేస్తూ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం ఉదయం ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ సతీసమేతంగా ముఖ్య అతిథిగా హాజరై సంబరాలను ప్రారంభించారు. అంతకుముందు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ను పోలీస్‌ అధికారులు అందంగా ముస్తాబు చేశారు. భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, గాలిపటాల హోరు, ఎడ్ల బళ్ల చప్పుడు, సంప్రదాయ పిండి వంటలు ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేశాయి. ఎస్పీ భోగి మంటను వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ యూనిఫాంలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది ఆటవిడుపుగా సంప్రదాయ దుస్తులలో తళుక్కున మెరిశారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసు అధికారులు అంతా తమ కుటుంబసభ్యులతో కలిసి ఒక్క చోటకు చేరి కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె.ప్రకాష్‌ బాబు, ఏఆర్‌ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ ఎన్‌.సుధాకర్‌, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ యు.సదాశివయ్య, డి.సి.ఆర్‌.బి సీఐ ఈశ్వర్‌రెడ్డి, కడప నగర సీఐలు చిన్న పెద్దయ్య, ప్రసాద రావు, ఓబులేసు, ఎల్లమరాజు, రెడ్డెప్ప, బాలమద్దిలేటి, రామకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు శివరాముడు, శ్రీశైలరెడ్డి, సోమశేఖర్‌ నాయక్‌, కడప సబ్‌ డివిజన్‌లోని సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు స్వామి నాయక్‌, వెంకటేశ్వర్లు, చూడామణి, శ్రీనాథ్‌, మహిళా ఆర్‌ఎస్‌ఐ పావని, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్‌, పోలీస్‌, డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కనుల పండువగా గోదా కల్యాణం1
1/1

కనుల పండువగా గోదా కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement