కమనీయం.. మకర జ్యోతి దర్శనం
● పులకించిన భక్తజనం
● తిరు ఆభరణాల ఉరేగింపులో
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం మకరజ్యోతిని దర్శించుకొన్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. జ్యోతి దివ్యదర్శనం కాగానే అయ్యప్పనామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. అంతకు ముందు స్థానిక సదుమ్మ ఆలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆభరణాలను తలపైనెత్తుకుని కేరళ వాయిద్యాలు, ప్రత్యేక గొడుగుల మధ్య ఊరేగింపుగా తీసుకొని అయ్యప్ప సన్నిధానానికి చేరుకొన్నారు. పడిమెట్ల గుండా స్వామి వారికి సమర్పించారు. తిరు ఆభరణాలు అలంకరించిన అనంతరం ఆలయ నారాయణన్ నంబూద్రి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న కొండల్లో సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం అంతా కర్పూర జ్యోతులు వెలిగించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు. భక్తులతో ఎర్రాతివారిపల్లె జనసంద్రంలా మారింది. ఆలయంలో పత్రాలు, పుష్పాలు, ఫలాలు, విద్యుత్ దీపాలతో చేసిన అలంకారం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, రేణుకమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, నిహాంత్‌రెడ్డి, అభినయ్ రెడ్డి, ఎంఆర్‌సీ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్, జింకా చలపతి, సురేంద్రనాథ రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డెప్ప, కల్యాణ భరత్ పాల్గొన్నారు.


