వక్ఫ్ ఆస్తుల రక్షణకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలి
మదనపల్లె : మదనపల్లెలోని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధ్యత వహించాలని ఏపీఎండీసీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్ జి.షమీంఅస్లాం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మదనపల్లెలో వక్ఫ్ ఆస్తి అయిన టిప్పు సుల్తాన్ మైదానంలోకి బెంగళూరు బస్టాండ్‌ను తరలించే అధికారుల ప్రతిపాదనలపై పునఃసమీక్షించాలని కోరారు. ఇప్పటికే టిప్పు మైదానంలో హాల్ట్ చేస్తున్న ప్రయివేటు బస్సుల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఎగ్జిబిషన్ నిర్వహణకు అద్దె వసూలు సొమ్ము ఎక్కడుందని నిలదీశారు. ఈ లెక్కలు ఎవ్వరూ చెప్పడం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో బస్టాండ్‌ను మైదానంలోకి తరలిస్తే మరిన్ని వివాదాలకు కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతపెద్దలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు, అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్ తరలింపు చర్యలను నిలిపివేయాలని, లేనిపక్షంలో కూలీలు, చిరువ్యాపారులు నష్టపోతారన్నారు. ఇప్పటికే బీటీ కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు విద్యాసంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. శానిటోరియం పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వానికి భూమి కావాలంటే మదనపల్లె చుట్టూ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అందులో అభివృద్ధి పనులు, కార్యాలయాలను నిర్మించుకోవాలని కలెక్టర్‌ను కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం మాట్లాడుతూ బ్రిటీష్ పాలన నుంచి బెంగళూరు బస్టాండ్ కొనసాగుతోందని అన్నారు. కౌన్సిలర్ బీఏ.ఖాజా మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించకుండా తరలింపు ప్రతిపాదన సమంజసం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గుండ్లూరు రఫీ మాట్లాడుతూ కడప, బెంగళూరు నుంచి వచ్చి ఆగిపోయే బస్సుల కోసం బెంగళూరు బస్టాండ్‌ను తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తరలింపు ఆపాలని మసీదు కమిటీ ఇప్పటికే వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, వినుతాబాయి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
బెంగళూరు బస్టాండ్ తరలింపు
అంగీకరించం
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోండి
వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ మెంబర్
షమీంఅస్లాం, నేతల డిమాండ్


