ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం బాబు నైజం
రాజంపేట రూరల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను తన అనుమాయులైన వ్యక్తులకు ప్రైవేటీకరణ చేయటం సీఎం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్‌లో బుధవారం కడప మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిలతో కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీఓలను బోగి మంటలలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఽఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నవి 12 మెడికల్ కళాశాలలు మాత్రమేనని గుర్తు చేశారు. అందులో దివంగత మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో 3 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. బాబు ఎన్ని పర్యాయాలు సీఎంగా ఉన్న ఒక మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయక పోవటం మన దౌర్భాగ్యమన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేసిన తర్వాత ప్రభుత్వానికి వాటిని పూర్తి చేసే బాధ్యత లేదా అని నిలదీశారు. మెడికల్ కళాశాలలను ముందుకు తీసుకెళ్లటంలో బాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబులో మార్పు వచ్చి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను మానుకోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులు తీసుకోరాదని హతవు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారని గుర్తు చేశారు. కడప మేయర్ సురేష్ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో వైద్యం కోసం పేద ప్రజల కష్టాలను చూసి తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించి పోయారన్నారు. వైద్యం అందుబాటులోకి వస్తే తమ ప్రజలందరూ సంతోషంగా ఉంటారని 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. అందులో 5 మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యాయి అన్నారు. 3 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి చేశారన్నారు. మిగిలిన కళాశాలలన్నీ 3 వేల కొట్లు వెచ్చిస్తే పూర్తి అవుతాయన్నారు. వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటీకరణం చేయటాన్ని వైఎస్సార్‌సీపీ నిరసిస్తోందన్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ, ర్యాలీలు, నిరసనలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మాసిమబాబు, చొప్పా యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు,
ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి


