రాయచోటి వాసి బెళుగుప్పలో ఆత్మహత్య
బెళుగుప్ప(అనంతపురం) : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం బెళుగుప్ప మండలంలోని గుండ్లపల్లిలో నివాసముంటున్న వేంపల్లి నాగేశ్వరరాజు (53) ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆయన 20 ఏళ్లుగా గుండ్లపల్లిలో అద్దె గదిలో నివాసముంటున్నాడు. డీఎంసీ కంకర యూనిట్‌లో ఆపరేటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తాను నివాసముంటున్న అద్దె గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బెళుగుప్ప పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కల్యాణదుర్గంలోని సీహెచ్‌సీలో ఉన్న మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : రుణ బాధతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన శ్రీధర్‌బాబు(35) పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద సుమారు రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఇటీవల కొంత కాలంగా రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో తిరిగి చెల్లించలేక మనస్తాపం చెంది ఇంటి వద్దే గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.


