అక్రమ లేఅవుట్లపై మున్సిపాలిటీ కన్నెర్ర
● అక్రమ లేఅవుట్లు తొలగింపు
● హడలిపోతున్న ప్రజలు, వ్యాపారులు
పుంగనూరులో అక్రమ లేఅవుట్లను తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు
పుంగనూరు : ఎన్నడు లేని విధంగా మున్సి పాలిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లను తొలగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. ప్లాట్లు కొన్నవారి రాళ్ళను, హద్దులను తొలగించడంతో వ్యాపారం కుదేలైంది. మంగళవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు లేఅవుట్లను తొలగించారు. పట్టణంలోని గోకుల్ థియేటర్ వెనుక భాగంలో సర్వేనెంబరు 156, తిరు పతి రోడ్డులోని యూఎన్‌ఆర్ సర్కిల్లోని సర్వేనెంబరు 27, 29లలో, చౌడేపల్లె రోడ్డులోని 24 సర్వే నెంబరులో, ఎన్‌ఎస్.పేట శుభా రాం డిగ్రీకళాశాల వద్ద సర్వేనెంబరు 24లో వేసిన అక్రమ లేఅవుట్లను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వాదేశాల మేర కు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. వ్యాపారులు మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి లేఅవుట్లను ఏర్పాటు చేస్తుండటంతో తొలగించామన్నారు. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈనెల 23 వరకు గడువు ఉందన్నారు. ఆలోపు అనుమతులు పొందాలన్నారు. అనుమతి పొందని స్థలాల క్రయవిక్రయాలు నిషేధిస్తూ, సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశామని కమిషనర్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు , వ్యాపారులు గమనించి, లేఔట్లకు అనుమతులు పొందాలని కోరారు. ఈ విషయమై పలువురు మాట్లాడుతూ లక్షలా ది రూపాయలు ఖర్చు చేసి వేసిన లేఅవుట్లను తొలగించడం బాధకరమన్నారు. డబ్బులు కట్టేందుకు గడువు ఉన్నా అధికారులు తొలగించడంతో వ్యాపారం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ లేఅవుట్లపై మున్సిపాలిటీ కన్నెర్ర


