అశ్రునయనాల మధ్య జవాన్ అంత్యక్రియలు
కురబలకోట : మండలంలోని తూపల్లికి చెందిన జవాన్ ఎన్. రాజశేఖర్‌రెడ్డి అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ముదివేడు సమీపంలో సోమవారం రాత్రి టిప్పర్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సెలవులో ఇంటికి వచ్చిన అతను మృత్యు ఒడికి చేరడం కలచివేసింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇతని అకాల మరణంతో పల్లె శోకసంద్రమైంది. తల్లి, భార్యను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. గ్రామంలో సంక్రాంతి పండగ సందడి స్థానంలో విషాద చాయలు అలుముకున్నాయి. జవాన్ ఆసస్మిక మృతి కుటుంబానికి తీరని వేదనగా మారింది. తండ్రి ప్రేమకు దూరమైన చిన్నారి ఊర్విని చూసి చలించిపోయారు. మనసుల్ని కలచివేసింది.
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన కుమార్ కుమారుడు మనోజ్ (21) పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా గౌతమీనగర్‌కు చెందిన మైనర్ బాలిక (16) స్థానికంగా పదో తరగతి చదువుతోంది. తరచూ కడుపునొప్పి వేధిస్తుండటంతో మంగళవారం మరోసారి నొప్పి తీవ్రం కావడంతో భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన మల్లికార్జున భార్య సుస్మిత(29) కుటుంబ సమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి..
మదనపల్లె రూరల్ : ఆరునెలల క్రితం మృతిచెందిన కుమారుడిని గుర్తుచేసుకుని కుమిలిపోతూ మదనపడుతున్న ఓ తల్లి, బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పిడింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, శ్యామలమ్మ(35) దంపతుల కుమారుడు భాస్కర్(15) ఆరునెలల క్రితం పెద్దమండ్యం మండలం కలిచెర్లలో జరుగుతున్న తిరునాల కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. స్థానికంగా ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి భాస్కర్ మృతి చెందాడు. అప్పటి నుంచీ తల్లి శ్యామలమ్మ తీవ్ర మనస్తాపంతో కుమారుడిపై బెంగ పెట్టుకుంది. ఈ క్రమంలో మంగళవారం కుమారుడి పుట్టినరోజు కావడంతో భాస్కర్‌ను గుర్తుచేసుకుని కుమిలిపోయింది. బిడ్డ లేని జీవితం వద్దనుకుని పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సల అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు ఐసీయూ విభాగంలో చికిత్సలు అందిస్తున్నారు.
అశ్రునయనాల మధ్య జవాన్ అంత్యక్రియలు


