రైలు ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా నిర్ణయాలు
– రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి
రాజంపేట : ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన రైల్వేస్టాండింగ్ కమిటీలో రైలు ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నట్లు రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ కమిటీ సభ్యుడు, రాజ్య సభసభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం రాజంపేట బైపాస్‌లోని మేడాభవన్‌కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైల్వేపరంగా నెలకొన్న ప్రయాణికుల సమస్యలను స్టాండింగ్ కౌన్సిల్‌లో చర్చించినట్లు చెప్పారు. మెరుగైన ప్రయాణానికి అవసరమైన చర్యలపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే కొత్త రైళ్లు, బోగీలు, రైలుమార్గాల పురోగతి, పలు స్టేషన్లలలో రైళ్ల హాల్టింగ్స్‌పై చర్చించామన్నారు. భారతీయ రైల్వేలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ అడుగులు వేస్తోందన్నారు. అనంతరం పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి,శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి, రాజంపేట మున్సిపాలిటి చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఏఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, టక్కోలు శివారెడ్డి, ఏకుల రాజేశ్వరీరెడ్డి , నందలూరు నేతలు గాలాసుధాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, బూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఆల్విన్ విజయుడు తదితరులు పాల్గొన్నారు.
– ఇరువురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం
పోరుమామిళ్ల : పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఈదుళ్లపల్లె సమీపంలో పెట్రోల్ బంకు వద్ద మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలసపాడు మండలం కొండపేట ఎస్సీ కాలనీకి చెందిన తప్పెట రఘు (21) మృతి చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా రావడంతో ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు రఘు పెయింటర్ పనికి వచ్చి అక్కడ ఉన్న స్కూటీని తీసుకుపోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాద ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తి మృతున్ని గుర్తించి, తన వద్దకు పెయింటింగ్ పనికి వచ్చి, అక్కడ పెట్టిన తన స్కూటీని దొంగలించుకు వచ్చాడని చెప్పాడు. కాశినాయన మండలం బాలాయపల్లెకు చెందిన ముగ్గురు ఒకే బైక్‌పై పోరుమామిళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైకులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా 108లో పోరుమామిళ్ల ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


