ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్
● 2 కిలోల గంజాయి స్వాధీనం
● ఏ–1, 2 నిందితుల కోసం గాలింపు
మదనపల్లె రూరల్ : మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ రవినాయక్ తెలిపారు. మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. కురబలకోట ఎస్‌ఐ మధురామచంద్రుడుకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈనెల 12న కురబలకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద నాగరాళ్లు వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని చుట్టుముట్టి పట్టుకుని వారి చేతిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ సంచులను పరిశీలిస్తే ఘాటైన గంజాయి వాసన వచ్చిందన్నారు. దీంతో కురబలకోట ఎంపీడీఓ గంగయ్య, వీఆర్వోలు ఖాదర్‌బాషా, రాజన్న సమక్షంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మదనపల్లె టౌన్, మేదరవీధికి చెందిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి తాలే తరుణ్(19), కురబలకోట మండలం చింతమాకులపల్లె పంచాయతీ పులుసుగుంతలకు చెందిన టేకుమంద నాగరాజ(45), మదనపల్లె పట్టణం రామారావుకాలనీ గంగమ్మగుడి వద్ద నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ షేక్ సయ్యద్‌వలీ(19)గా గుర్తించామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు, కానిస్టేబుల్స్ రెడ్డిశేఖర్, సిద్ధేశ్వర, చక్రపాణి, వెంకటేశ్వరులు, శ్రీనివాసులు, జీ.ప్రసాద్‌ను అభినందిస్తూ రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు.


