ప్రజల సంక్షేమాభివృద్ధే లక్ష్యం
రాయచోటి: ప్రజల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలనను అందించాలన్న దృక్పథంతో అధికారులు పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి ప్రస్తుత స్థితిపై సంబంధిత అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు.
మొంథా తుఫాను....
మొంథా తుఫాను సమయంలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖలు తీసుకున్న చర్యలు, వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను మంత్రులకు జిల్లా కలెక్టర్ వివరించారు.
రెవెన్యూ సమస్యలపై..
రెవెన్యూ శాఖపై జీఓ 30 పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన అర్జీలు వాటి పరిష్కారం, రీ సర్వే మూడవ విడత తదితర అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ వివరించారు. రెవెన్యూ సమ్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అసైన్‌మెంట్ కమిటీలు, స్మశాన వాటికల సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పరిష్కారం కాని ఆర్‌ఓఆర్ అప్పీల్స్, ఇతర అంశాలపై అర్జీదారులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
వ్యవసాయం..
వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో 18 శాతం మాత్రమే సాగు చేశారన్నారు. జిల్లాలో హార్స్ గ్రామ్ విత్తనాల పంపిణీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన సూచనల మేరకు విత్తనాలు పంపిణీ చేశామన్నారు. అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న ముఖ్య ఉద్యానవన పంటలు సాగు విస్తీర్ణ ముఖ్యమైన పథకాలు తదితర అంశాలపై కమిటీ సభ్యులకు ఉద్యానవన శాఖ అధికారిణి వివరించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ మామిడికాయ పాడవకుండా కోతకు వచ్చేంత వరకు పేపర్ కవర్ల వినియోగాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంజినీరింగ్ శాఖలు..
పంచాయతీరాజ్, రహదారులు, భవనాలశాఖ, హౌసింగ్ శాఖ, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల, భూగర్భజల శాఖల జిల్లా అధికారు లు ఆయా శాఖల అంశాలను కమిటీ సభ్యులకు వివ రించారు. రాయచోటి–సుండుపల్లి–పింఛా రోడ్డు, నిమ్మనపల్లి–వాయల్పాడు, గాలివీడు రోడ్డు తదితర రహదారుల ప్రస్తుత స్థితిగతులను తెలిపారు.
భూగర్భ జలాల పెరుగుదల...
సాగునీటి శాఖ ఆధ్వర్యంలో చెరువులు నింపే కార్య క్రమాన్ని చేపట్టామని తద్వారా 3.4 మీటర్ల వరకు జలాలు పెరిగాయని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం 3068 చెరువులు ఉండగా వీటిలో 50 శాతం చెరువులు సగానికంటే ఎక్కువగా నిండాయన్నారు. సాగునీటి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అడవిపల్లి రిజర్వాయర్, శ్రీనివాసపురం రిజర్వాయర్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాలువ పనులు, ఝరికోన ప్రాజెక్టు తదితర అంశాలపై సంబంధిత అధికారి కమిటీ సభ్యులకు వివరించారు.
వైద్యం, విద్య...
వైద్య, ఆరోగ్యశాఖపై జరిగిన చర్చలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉందని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులకు వివరించారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా అన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టంగా అమలు పరిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జిల్లా అభివృద్ధికి డీడీఆర్‌సీ ఒక వేదిక
రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి


