మైనర్లకు వాహనాలు ఇస్తే లైసెన్సులు రద్దు
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి: మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి లైసెన్సులు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో మైనర్లు వాహనాలు నడపడంపై ఎస్పీ మంగళవారం ప్రకటన ద్వారా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
ఎస్పీ సూచనలు..
● 18 సంవత్సరాల లోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు లేదా ఇతర మోటారు వాహనాలు నడపడానికి ఇవ్వరాదు. వారి భద్రతకు, పౌరుల రక్షణకు ఇది చాలా ముఖ్యం.
● మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు, సంరక్షకులు, వాహన యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సు రద్దు చేస్తాం.
● నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకుంటాం.
● తల్లిదండ్రులు, సంరక్షకులు బాధ్యతగా వ్యవహరించి తమ పిల్లలు రోడ్డుపైకి వచ్చి ప్రమాదాల బారిన పడకుండా, ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా అప్రమత్తంగా ఉండాలి.
● జిల్లాలో రోడ్డు భద్రతను కాపాడటానికి జిల్లా పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలి.


