పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై కలెక్టర్ సమీక్ష
కలెక్టర్ నిశాంత్ కుమార్
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా కొత్త పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులపై ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తొలుత డీఆర్‌ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో 2025 జనవరి 1వ తేదీనాటికి పురుషుల ఓటర్ల సంఖ్య 7,01,703 మంది, మహిళల ఓటర్ల సంఖ్య 7,28,220 మంది, థర్డ్ జెండర్ 130 మంది మొత్తం 14,30,053 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య 1609 ఉండగా ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలు 205గా ఈఆర్‌ఓలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సంప్రదించి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు జిల్లాకు పంపామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు ఉండేలా రెండు కిలోమీటర్ల లోపు ఓటింగ్‌లో భవనాలు వీలైనంత వరకు కింద ఉండేలా చూడాలన్నారు. మౌలిక సదుపాయాలతో ఉండే విధంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా కొత్త పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు జిల్లా స్థాయిలో చేపడతారన్నారు. ఇందులో భాగంగా మదనపల్లిలో పోలింగ్ కేంద్రాలు 65, రాజంపేట 32, రైల్వేకోడూరు 24, రాయచోటి 32, తంబళ్లపల్లి 32, పీలేరు 20, ఇలా ప్రతిపాదనలు పంపించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, రాజంపేట, మదనపల్లి సబ్ కలెక్టర్లు హెచ్‌ఎస్ భావన, చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ మధుసూదన్ రావు, తహసీల్దార్లు, కో–ఆర్డినేటర్లు , సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనేయులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


