అదృశ్యమైన వృద్ధుడి ఆచూకీ లభ్యం
రాయచోటి టౌన్ : మతి స్థిమితం కోల్పోయిన ఓ వృద్ధుడు ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం కుమారుడు, మనవడు గాలించి ఎట్టకేలకు శనివారం గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. వివరాలు ఇలా..
రామాపురం మండల కేంద్రానికి చెందిన మాధవరం తిమ్మయ్య(75)కు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వారందరికీ వివాహాలై స్థిరపడ్డారు. కాగా పదేళ్ల క్రితం తిమ్మయ్య భార్య మృతి చెందింది. అప్పటి నుంచి అతను మతిస్థిమితం కోల్పోయాడు. అప్పడప్పుడు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీ ఇంటినుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. తొలుత రాయచోటి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి అక్కడి నుంచి వీరబల్లి మండలం ఓదివీడు పంచాయతీ బెస్తపల్లెకు వెళ్లగా గ్రామస్తులు చేరదీశారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న కుమారుడు రామచంద్ర, మనవడు రఘురాం బెస్తపల్లె గ్రామానికి చేరుకుని తిమ్మయ్యను తమ వెంట తీసుకెళ్లారు.


