స్పేస్‌ పిలుస్తోంది.. మీరు సిద్ధమేనా?

YUVIKA 2022 Inspire Students to Pursue Careers in Science, Tech: Rajarajan - Sakshi

యువిక–2022 విద్యార్థులతో షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌

సూళ్లూరుపేట: ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా రావాలని, భారతదేశాన్ని శాస్త్రీయ భారత్‌గా బలోపేతం చేయాలని స్పేస్‌ సైన్స్‌ పిలుస్తోందని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ చెప్పారు. ఆ పిలుపునకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి యువిక యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాం–2022కు ఎంపికైన 153 మంది విద్యార్థులు శుక్రవారం షార్‌లోని లాంచింగ్‌ ఫెసిలిటీస్, రాకెట్‌ లాంచింగ్‌ పాడ్స్, మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లను సందర్శించారు. 


నేటితరం విద్యార్థులను స్పేస్‌ సైన్స్‌ వైపు ఆకర్షించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న యువిక–2022 కార్యక్రమాన్ని ఈనెల 16న ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. నేటి (శనివారం) వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం సాయంత్రం షార్‌ కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు స్పేస్‌ సెంటర్‌ను సందర్శించిన అనంతరం బ్రహ్మప్రకాష్‌ హాలులో జరిగిన సమావేశంలో రాజరాజన్‌ మాట్లాడారు. విద్యార్థులకు ఎంతసేపైనా శ్రమించగలిగే అత్యంత శక్తిసామర్థ్యాలుంటాయని చెప్పారు. 


మన విద్యార్థులు ఈ రోజున తేలికపాటి ఉపగ్రహాలు తయారుచేసే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఇస్రో సెంటర్లపై అవగాహన కల్పిస్తే ఈ 153 మందిలో కనీసం ఓ పదిమందైనా ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారనే ఆశతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు షార్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగవేదిక నుంచి రోహిణి సౌండింగ్‌ రాకెట్‌ను ప్రయోగించి విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top