‘సీమ’కు ఎప్పుడూ బాబు ద్రోహమే | YSRCP leaders call for implementation of Rayalaseema lift irrigation | Sakshi
Sakshi News home page

‘సీమ’కు ఎప్పుడూ బాబు ద్రోహమే

Apr 11 2026 3:32 AM | Updated on Apr 11 2026 11:37 AM

YSRCP leaders call for implementation of Rayalaseema lift irrigation

తెలంగాణ సీఎం రేవంత్‌తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్‌ను ఆపడం ద్రోహం 

ఎలాంటి పోరాటాలకైనా సిద్ధం కావాలి 

సాగునీరు అందిస్తే అమరావతి కంటే సెల్ఫ్‌ ఫైనాన్స్‌గా రాయలసీమ మారుతుంది 

రాయలసీమ ఎత్తిపోతల సాధన కోసం వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం :  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఉద్యమబాట పట్టారు. పోతిరెడ్డిపాడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆపై తిరుపతి, కడపలో సమావేశాలు నిర్వహించారు. 

ఈ క్రమంలోనే శుక్రవారం అనంతపురంలో ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన’ పేరుతో పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి,  కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మాజీమంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 

‘సీమ’ లిఫ్ట్‌పై విస్తృత చర్చ జరగాలి.. 
రైతులు విత్తనాలు, ఎరువులతో పాటు ఏదైనా కొనుగోలు చేయగలరు. కానీ, సాగునీరు కొనలేరు. దీన్ని ప్రభుత్వాలు అందించాలి. అది వాటి బాధ్యత. చంద్రబాబు ఎప్పుడూ రైతుల గురించి ఆలోచించలేదు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు వైఎస్సార్‌ పెంచారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ లిఫ్ట్‌ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతలతో 800 అడుగుల నుంచే నీటిని తోడేలా ప్రాజెక్టులు నిర్మించింది. దీంతో మనమూ లిఫ్ట్‌ నిర్మించాల్సి వచ్చింది. 

కానీ, చంద్రబాబు వచ్చాక పనులు ఆపేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు ఆపించానని రేవంత్‌రెడ్డి చెప్పేదాకా దీని వెనకున్న కుట్రను ఎవరూ గ్రహించలేదు. రాయలసీమ లిఫ్ట్‌పై విస్తృత చర్చ జరగాలి. చంద్రబాబు వైఖరిని ఎండగట్టాలి. దీనిపై కార్యాచరణ రూపొందించి పోరాడాలి. వ్యవసాయం, సాగునీటి విషయాల్లో చంద్రబాబు ‘సీమ’కు ఎప్పుడూ ద్రోహమే చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్‌ సాధన ఉద్యమాన్ని జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ, మండల స్థాయికి తీసుకెళ్లాలి.  

మా ప్రాంతం గొంతు కోయడమే.. 
రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను చంద్రబాబు ఆపడమంటే మా ప్రాంతం గొంతు కోయడమే. ఎవరు అడ్డొచ్చినా లిఫ్ట్‌ను ఆపలేరు. దాన్ని కచ్చితంగా సాధిస్తాం. రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు ఆపేస్తే సీమ వాసి అయి ఉండి మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించడంలేదు. ఆయనకు సిగ్గుందా? చంద్రబాబు సీమకు చేసిన ఒక్క మంచి పని చెప్పాలి. సీమ లిఫ్ట్‌ పూర్తయితే హంద్రీ–నీవా నీటిని మొత్తం అనంతపురం, కర్నూలు జిల్లాలు వినియోగించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ అంటున్నారు. 

కానీ, సీమకు సాగునీరిస్తే అమరావతి కంటే ఎక్కువగా రైతులు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ చేసి ప్రభుత్వానికి ఆదాయం ఇస్తారు. రేవంత్‌ తెలంగాణ అసెంబ్లీలో చెప్పే వరకూ రాయలసీమ లిఫ్ట్‌ రూ.3,850 కోట్లతో నిర్మిస్తున్నామని ఎవ్వరికీ తెలీదు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, రంగయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, అనంత, చిత్తూరు పార్లమెంట్‌ పరిశీలకుడు నరేశ్‌కుమార్‌రెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సమావేశంలో చేసిన తీర్మానాలు
» హంద్రీ–నీవా ప్రధాన కాలువను  6,300 క్యూసెక్కులకు విస్తరించాలి. 
» హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలను  పూర్తిచేసి ఆయకట్టుకు నీరివ్వాలి. 
»  బీజేపీ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్‌ అమలుచేయాలి. 
» కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో పాటు లా యూనివర్సిటీ నిర్మించాలి. 
» పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 80 వేల క్యూసెక్కులకు పెంచాలి. 
»   రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే పూర్తిచేయాలి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement