బాబు సర్కార్‌ దగాపై అంగన్‌వాడీల ఉద్యమబాట | Anganwadi dharnas across the state on the 23rd | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ దగాపై అంగన్‌వాడీల ఉద్యమబాట

Apr 11 2026 3:27 AM | Updated on Apr 11 2026 3:26 AM

Anganwadi dharnas across the state on the 23rd

హామీల అమలు కోసం 23న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు 

వేతనాల పెంపు సహా డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె 

చంద్రబాబు నమ్మించి మోసం చేశారు  

అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయలేదు.. 

నిప్పులు చెరిగిన అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు

సాక్షి, అమరావతి: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి అంగన్‌వాడీలు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టి.. చంద్రబాబు సర్కార్‌ మోసాన్ని ఎండగడతామని వెల్లడించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూలకు చెందిన అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర నాయకులు శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ.. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. 

అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారని, సీఎంతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. అందుకే మరోసారి ఉద్యమ బాట పడుతున్నామని చెప్పారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఏఐటీయూసీ) అధ్యక్షురాలు జె.లలితమ్మ మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో అంగన్‌వాడీల వేతనాలు పెంచినా.. ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎఫ్‌టీయూ) నాయకురాలు పి.పద్మ మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రధాన హామీలు నెరవేర్చడం లేదని, ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. సమావేశంలో నాయకులు టి.గజలక్ష్మి, ఎం.శారమ్మ, కె.పద్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, తమ సమస్యలపై మంత్రి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారికి అంగన్‌వాడీ నాయకులు శుక్రవారం సచివాలయంలో వినతిపత్రం అందించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.  

ప్రధాన డిమాండ్లు.. 
2024 జూన్‌ నుంచి వేతనాలు పెంచుతామన్న హామీ అమలు చేయాలి. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు, మినీ వర్కర్లను మెయిన్‌గా మార్చుతూ ఇచ్చిన మూడు జీవోలు అమలు చేయాలి. హెల్పర్ల పదోన్నతికి మార్గదర్శకాలు రూపొందించాలి. అంగన్‌వాడీ పనులు మాత్రమే అప్పగించాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్, సంక్షేమ పథకాలు అందించాలి. పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్‌ పోస్టులపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో 1,810 మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement