రాష్ట్రమంతటా అదే చర్చ జరుగుతోందన్న మంత్రులు
దాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం
మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి దీటైన స్పందన లేదని పెదవి విరుపు
ఏబీఎన్ రాధాకృష్ణకు మద్దతివ్వాల్సిందేనని దిశా నిర్దేశం
కేబినెట్ అజెండా లీక్‌పై ఆరా.. అధికారులపై మండిపాటు
సీఎంఆర్‌ఎఫ్‌లో అవినీతిపై నివేదికకు ఆదేశం
సాక్షి, అమరావతి : మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్‌గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్‌పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మావిగన్‌పై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. దీనివల్ల అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన అంశానికి పెద్దగా ప్రచారం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మంత్రులు వెనుకబడ్డారని, మావిగన్‌ను తిప్పికొట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసి.. వ్యతిరేకంగా పని చేయించినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మాత్రం దీటైన స్పందన రాలేదని అన్నట్లు తెలిసింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని, అందుకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారని సమాచారం. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలని.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు అన్నిచోట్లా పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు.
కనీసం ఆయా పనులు మొదలయ్యేలా అయినా చర్యలు తీసుకుంటేనే అర్బన్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఏబీఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడారనే విషయంతో సంబంధం లేకుండా పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అజెండా, అందులో చర్చించే అంశాలు ముందుగానే లీక్ అవుతున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుసుకోవడం పెద్ద పని కాదని, కానీ అలా జరక్కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
లీకులు మంత్రుల నుంచి జరుగుతోందా, అధికారుల నుంచా అని ఆరా తీసినట్లు తెలిసింది. అదే సమయంలో తమకు కేబినెట్ అజెండా ఇప్పటి వరకు అందలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌లో జరుగుతున్న అవినీతిపై సాక్షిలో ప్రచురితమైన కథనంపైనా చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి, తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం.


