కొండ్రెడ్డి హ్యాట్రిక్‌.. అభినందించిన మంత్రి అనిల్‌

YSRCP Leader Kondreddy Rangareddy Wins Vijaya Dairy Director - Sakshi

2011 నుంచి విజయ డెయిరీ డైరెక్టర్‌గా వరుసగా మూడుసార్లు ఎన్నిక

చైర్మన్‌గా కొసాగింపు  

మూడు డైరెక్టర్‌ పదవులు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ..

సాక్షి, నెల్లూరు : ఉత్కంఠంగా సాగిన విజయ డెయిరీ డైరెక్టర్‌ పోరులో వైఎస్సార్‌సీపీ నేత కొండ్రెడ్డి రంగారెడ్డి వరుసగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సృష్టించారు. ఇప్పటికే డెయిరీ చైర్మన్‌ పదవిలో ఉన్న కొండ్రెడ్డి డైరెక్టర్‌గా మరోసారి ఎన్నిక కావడంతో అదే పదవిలో ఆయన కొనసాగనున్నారు. 
►1969లో విజయ కో ఆపరేటివ్‌ డెయిరీ సంస్థ ఏర్పాటైంది. 1986లో మొట్టమొదటి పాలక వర్గం కొలువు దీరింది. అప్పటి నుంచి వరుసగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది.
►గతంలో ఒకరు మూడు పర్యాయాలు వరుసగా చైర్మన్‌గా పదవిలో కొనసాగిన చరిత్ర ఉంది. 
►గతంలో డైరెక్టర్‌ పదవుల నుంచి చైర్మన్‌ పదవుల వరకు ఏకగ్రీవాలే ఎక్కువగా ఉండేవి.
►ఇప్పుడు ఆ పదవులకు సాధారణ ఎన్నికల తరహాలో హడావుడి, రాజకీయ పార్టీల జోక్యం ఉండడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. 
►ఇలాంటి ఎన్నికల్లో కొండ్రెడ్డి మూడోసారి డైరెక్టర్‌గా గెలుపొందారు.
►రంగారెడ్డి అల్లూరు మండలం నార్తుమోపూరు సొసైటీ నుంచి డైరెక్టర్‌గా నామినేషన్‌ దాఖలు చేసి ఎన్నికవుతూ 2011 నుంచి వరుసగా చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
►2011, 2015లో జరిగిన డెయిరీ సాధారణ ఎన్నికల్లో అదే స్థానం నుంచి డైరెక్టర్‌గా పోటీ చేసి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 
►ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన డైరెక్టర్‌ స్థానానికి మూడో సారి పోటీ చేసి విజయం సాధించడంతో ఆ పదవిలో ఆయన కొనసాగనున్నారు. 
►ఏడాదికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్లు వార్షిక టర్నోవర్‌ ఉన్న డెయిరీ పాలకవర్గానికి సంబంధించి ఏటా రొటేషన్‌ పద్ధతిలో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక జరుగుతోంది. 
►ఈ ఏడాది మూడు డైరెక్టర్లలో రెండు స్థానాలు మహిళలు, మరొకటి చైర్మన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న డైరెక్టర్‌ పోస్టు కావడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. 
►రెండు మహిళా డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. చైర్మన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం కూడా ఏకగ్రీవం దిశగా తొలుత కసరత్తు జరిగినా.. చివరకు ఎన్నిక అనివార్యమైంది. 
►ఏటా పది వేల లీటర్ల పాలను సహకార సంఘం ద్వారా డెయిరీకి విక్రయించే సంఘానికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. 
►ఈ క్రమంలో ఈ ఏడాది 118 మంది సొసైటీ చైర్మన్లకు ఓటు హక్కు ఉంది. 
►ఇందులో 86 ఓట్లు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతుతో కొండ్రెడ్డి రంగారెడ్డి సాధించగా, టీడీపీ మద్దతుతో బరిలో నిలిచి కోటా చంద్రశేఖర్‌రెడ్డి 32 ఓట్లు సాధించారు. 54 ఓట్ల ఆధిక్యంతో రంగారెడ్డి గెలుపొందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top