పులివెందుల క్యాంపు కార్యాలయం సమీపంలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
కష్టాల్లో ఉన్న వారికి వైఎస్ జగన్ భరోసా
పులివెందులలో ఘన స్వాగతం పలికిన ప్రజలు
నేతలు, కార్యకర్తలకు పేరు పేరునా పలకరింపు
సెల్ఫీలు, కరచాలనానికి పోటీపడిన జనం
సాక్షి, కడప: కష్టాలు చెప్పుకున్న వారందరికీ నేనున్నానంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్న జగన్‌కు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. భాకరాపురం సమీపంలోని హెలిప్యాడ్ నుంచి ఇంటికి చేరుకునే వరకు జగన్‌ను చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా బారులుతీరారు. యువత జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్.. నాయకులు, కార్యకర్తలు, స్థానికులను పేరు పేరునా పలుకరించారు. పలువురితో సెల్పిలు దిగారు. మధ్యలో కాన్వాయ్‌ని ఆపిన అభిమానులతో కరచాలనం చేశారు. ప్రజల నుంచి వినతులు సైతం స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా, క్యాంపు కార్యాలయంలో వేద పండితులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు.

పులివెందులలోని తన నివాసానికి వచ్చే మార్గంలో కాన్వాయ్ ఆపి ప్రజల కష్టాలు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్
పార్టీ నేతలతో చర్చలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. వివిధ అంశాలపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది వైఎస్ జగన్‌ను కలిసి వివాహ శుభ లేఖలు, వినతులు అందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
నేడు ఇప్పట్లకు వైఎస్ జగన్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సుధాకర్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.


