ఆరోగ్యానికి వై‘ఎస్సార్‌’.. ప్రైవేటుకు దీటుగా వైద్యం

YSR Urban Health Centers as gift to Poor People Andhra Pradesh - Sakshi

పట్టణ పేదలకు వరంగా వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు

విస్తృతంగా సేవలు

కొత్తగా అందుబాటులోకి 23

కాకినాడ సిటీ: చిన్న జబ్బు చేసి, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రోజుకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 ఖర్చు చేయాల్సిందే. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారికి తరచూ రక్త పరీక్ష, మందుల ఖర్చు సరేసరి. ఇటువంటి పరిస్థితుల్లో జబ్బు చేసిందంటే పేదవారు ఆర్థికంగా ఇబ్బందులు పడక తప్పేది కాదు. ఈ దుస్థితి నుంచి వారిని బయట పడేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంపై ఫోకస్‌ పెట్టారు. పక్కా భవనాలు, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది, అన్ని సౌకర్యాలతో వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు (యూహెచ్‌సీ) ఏర్పాటు చేశారు.

ఇవి పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా ఇస్తున్నాయి. కాకినాడ, పెద్దాపురం, తుని, సామర్లకోట, పిఠాపురం వంటి పట్టణాల్లో శివారు ప్రాంతాల నుంచి సైతం 10 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా యూహెచ్‌సీలు ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ) ఉండగా, వీటితో పాటు జిల్లాలో కొత్తగా 23 వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో యూహెచ్‌సీకి రూ.80 లక్షల చొప్పున వెచ్చించారు.

ప్రభుత్వ సాయం మరువలేం
పిల్లలు, వృద్ధులకు చిన్నపాటి జబ్బు చేస్తే.. ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. చాలా దూరం కావడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లడానికి ఎంతో సమయం పట్టేది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సత్వరమే ఉచిత వైద్యం అందిస్తోంది. ప్రభుత్వ సాయాన్ని పేద ప్రజలు ఎప్పటికీ మరువలేరు.
– డి.జితేంద్రసింగ్, స్వర్ణాంధ్ర కాలనీ, కాకినాడ

అన్ని రకాల చికిత్సలూ అందిస్తున్నాం
వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో పేదలకు అన్ని రకాల వైద్య చికిత్సలూ అందిస్తున్నాం. ముఖ్యంగా ల్యాబ్‌ ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక రోగులకు ఎప్పటికప్పుడు ఉచితంగా మందులు అందజేస్తున్నాం. కొంత ఇబ్బందికరంగా ఉన్న రోగులను పర్యవేక్షణలో ఉంచుకుని, వైద్యం అందించేందుకు 10 పడకలు సిద్ధంగా ఉన్నాయి.

ఇప్పడిప్పుడే వీటికి అవసరమైన పరికరాలు వస్తున్నాయి. రోగులకు అవసరమైన స్థాయిలో సిబ్బంది ఉండటంతో సత్వరం వైద్య సేవలందిస్తున్నాం. వారంలో ఒక రోజు ఇద్దరు, ముగ్గురు స్పెషలైజేషన్‌ చేసిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
– డాక్టర్‌ వి.మహేష్, పర్లోవపేట, వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్, కాకినాడ

ఇవీ సౌకర్యాలు
► ఒక్కో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను 10 గదులతో నిర్మించారు.
► ప్రతి భవనంలో 10 పడకలు, ఓపీ–1, ఓపీ–2, లేబర్‌ రూము, మైనర్‌ ఆపరేషన్‌ థియేటర్, ల్యాబ్, యోగా గది, ఫార్మా గది, మినీ వార్డులు ఉన్నాయి.
► ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఒక వైద్యాధికారి వైద్య సేవలు అందిస్తారు. వీరితో పాటు ఇద్దరు స్టాఫ్‌ నర్సులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, అటెండర్‌ అందుబాటులో ఉంటారు.
► ప్రతి సోమవారం ఒక స్పెషలైజేషన్‌ వైద్యుడి సేవలు అందిస్తున్నారు.
► బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక రోగులు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగనవసరం లేకుండా అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోనే రక్త పరీక్షలు చేస్తారు.
► అనంతరం వైద్యులు ఆ రిపోర్టులు చెక్‌ చేసి, ఉచితంగా మందులు అందజేస్తారు.
► ల్యాబ్‌లో అన్ని రకాల వైద్య పరీక్షలూ ఉచితంగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
► ఎవరికైన రోగ తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ–సంజీవని యాప్‌ ఆయా స్పెషలైజ్‌డ్‌ డాక్టర్ల సలహా తీసుకుని, చికిత్స చేసి, మందులు అందజేస్తారు.

శివారు ప్రాంతాలకు ఎంతో మేలు
డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పట్టణాల్లోని శివారు ప్రాంత ప్రజలకు వరంలా ఉన్నాయి. కాకినాడ నగరంలోని దుమ్ములపేట, పర్లోవపేట, సంజయ్‌నగర్, సాంబమూర్తినగర్, రేచర్లపేట కొత్త కాకినాడ, జగన్నాథపురం, నరసింహా రోడ్డు, పప్పుల మిల్లు, పద్మనాభ నగర్, ఏటిమొగ, ముత్తానగర్, మహాలక్ష్మి నగర్, రణదీప్‌ నగర్, నాయకర్‌ నగర్, జె.రామారావుపేట, ఏసువారి వీధి, చినమార్కెట్‌ తదితర శివారు ప్రాంతాలకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ఈ శివారు కాలనీల్లోని ప్రజలు గతంలో ఏదైనా చిన్నపాటి జబ్బు చేస్తే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్‌)కి వెళ్లడానికి చాలా వ్యయప్రయాసలు పడేవారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్లతో చేరువలోనే సత్వర వైద్య సేవలు అందుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top