వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఈ పేరు వింటేనే ఆత్మీయత.. కొండంత భరోసా.. అభివృద్ధికి చిరునామా.. పొలాలకు సాగు జలాలు తరలించి బంగారు పంటలు పండేందుకు జలయజ్ఞం చేపట్టి రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలు నిలిపి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. అభివృద్ధి అంటే ఏమిటో చేతల్లో చూపించి సిసలైన ప్రజానాయకుడిగా మన్ననలు అందుకున్నారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పనులు చేపట్టి ఉమ్మడి జిల్లా రైతుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఆయన చేసిన మేలును మనసారా స్మరించుకుంటున్నారు. వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. సంతృప్తికర స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేసి అన్ని వర్గాల ప్రజల మనసు దోచుకున్నారు. ఆయన చేసిన సేవలు, సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. జలయజ్ఞంతో రైతుల పాలిట అపర భగీరథుడయ్యారు. ఆరోగ్య శ్రీతో పేదల గుండెల్లో ఊపిరై నిలిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద ఎంతో మంది పేద విద్యార్థులను ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దారు.
అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించి సిసలైన నాయకుడని ప్రజల మెప్పు పొందారు. ఆ మహానీయుడు మన నుంచి దూరమైనా ఇప్పటికీ అందరి మదిలో కొలువై ఉన్నారు. ‘నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ..’ అంటూ ఆప్యాయంగా ఆయన పిలిచే పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. వైఎస్సార్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరు నవ్వు మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి కృష్ణాజిల్లాను అభి వృద్ధి పథంలో పరుగులు పెట్టించారు.
సాగుకు ఉచిత విద్యుత్ అందించి బీడువారిన పొలాల్లో బంగారు పంటలు పండించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల పేర్లు చెప్పగానే ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖరరెడ్డినే గుర్తు చేసుకుంటారు. బుధవారం వైఎస్సార్ 77వ జయంతిని పురస్కరించుకొని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉమడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మేలు పొందిన ప్రజలు సైతం స్వచ్ఛందంగా వైఎస్సార్ జయంతి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో‘ రాజన్న’ ముద్ర
2008 జూన్ ఆరో తేదీన అవనిగడ్డ మండలం పులిగడ్డ వార్పు వద్ద కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.కృష్ణా డెల్టా పరిధిలో 13.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ.4,573 కోట్లతో ఆధునికీకరణ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు వెచ్చించారు. వైఎస్ హయాంలోనే ఈ ఆధునికీకరణ పనులు 40 శాతం పూర్తయ్యాయి.
2008 ఏప్రిల్ 23వ తేదీన రూ.1,500 కోట్లతో బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని పోర్టు పనులను ఆయన తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పరుగులు పెట్టించారు.
కృష్ణా డెల్టాకు ఆయువుపట్టు అయిన పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు.
అవనిగడ్డ, విజయవాడ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు అప్పటి వరకూ సింగిల్ రోడ్డుగా ఉన్న కరకట్ట రహదారిని రెండు లైన్లకు విస్తరించి అభివృద్ధి చేశారు.
నాగాయలంక మండలం భావదేవరపల్లిలో రాష్ట్రంలో తొలి మత్య్సకార పాలిటెక్నిక్ కళాశాలను వైఎస్సార్ ఏర్పాటు చేశారు.
నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అక్కడ వేలాది మంది విద్యార్థులు సాంకేతిక విద్యను ఉచితంగా అందుకుంటున్నారు.
ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొన్న వైఎస్సార్ జయంతి వేడుకలు బుధవారం జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.


