భూ రికార్డుల స్వచ్ఛీకరణకు షెడ్యూల్‌ ఇవ్వండి: సీఎం జగన్‌

YS Jagan Mohan Reddy Review Village And Ward Secretariat - Sakshi

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలు

సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరు

భూ రికార్డుల ప్రక్షాళనకు షెడ్యూల్‌ 

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించేలా వాటిలో ఉన్న ఖాళీలకు సెప్టెంబరు లోగా పరీక్షలు నిర్వహించి, వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలపై వారికి స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. 

గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమావేశంలో అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు నిర్మించడంతో పాటు, వాటిని సక్రమంగా నిర్వహించాలన్నారు. మిగిలిపోయిన వార్డు సచివాలయ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పైనా శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను డిజిటల్‌ బోర్డుల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు సీఎం జగన్‌. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని సీఎం కోరగా, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని అధికారులు తెలిపారు. (కొత్తగా 2.90 లక్షల బియ్యం కార్డులు)

నెల రోజుల్లో పరిష్కారం..
గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నామన్నారు సీఎం జగన్‌. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించే విధంగా యాక్షన్‌ ప్లాన్‌కు సన్నద్ధం కావాలన్నారు. నెల రోజుల్లో ఆయా దరఖాస్తులు పరిష్కరించి ఇంటి స్థలం పట్టా ఎక్కడ ఇవ్వాలి అనేది నిర్ణయించాలన్నారు. అవసరమైన భూమి సేకరించడం తదుపరి కార్యక్రమాలన్నీ మిగిలిన సమయంలో పూర్తి చేసుకోవాలన్నారు. ఫలితంగా 90 రోజుల్లోగా అనుకున్న సమయానికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వగలమని.. లేదంటే దరఖాస్తులు పేరుకుపోతాయని తెలిపారు. నిర్ణీత సమయంలో దరఖాస్తులు పరిష్కారం కాకపోతే, కారణాలు ఏమిటన్నది సీఎం కార్యాలయానికి తెలపాలన్నారు.

రికార్డుల ప్రక్షాళన..
ల్యాండ్‌ రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్‌ ప్రకటించాలన్నారు సీఎం జగన్‌. ఆ షెడ్యూల్‌ను తనకు నివేదించాలని తెలిపారు. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top