పేదల భూములు ఫలహారం! | YS Jagan amends the Assigned Act to provide ownership rights | Sakshi
Sakshi News home page

పేదల భూములు ఫలహారం!

Jan 18 2025 5:19 AM | Updated on Jan 18 2025 5:19 AM

YS Jagan amends the Assigned Act to provide ownership rights

ఫ్రీ హోల్డ్‌ అయిన 13.59 లక్షల ఎకరాల స్వాధీనానికి కూటమి సర్కారు పన్నాగాలు

అసైన్డ్‌ భూములపై పేదలకు హక్కులు కల్పించడమే నేరమన్నట్లు కక్ష సాధింపు

అసైన్డ్‌ చట్టానికి సవరణ చేసి యాజమాన్య హక్కులు కల్పించిన వైఎస్‌ జగన్‌

ఎన్నో ఏళ్లుగా ఆ హక్కుల కోసం పోరాడిన రైతులకు ఊరట కల్పిస్తూ విప్లవాత్మక నిర్ణయం

దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ నిరుపేదల భూములకు ఎసరు పెడుతున్న బాబు సర్కారు

స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు వాడుకునేందుకు సన్నద్ధం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలపైనా కత్తి

ఇళ్లు కట్టుకోలేదనే నెపంతో స్థలాలను రద్దు చేసే దిశగా అడుగులు  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ హయాంలో లబ్ధి పొందిన పేద రైతుల పొట్ట గొట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుపేదలు ఇప్పటికే పూర్తి హక్కులు పొందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు, వారికి కేటాయించిన ఇళ్లను రద్దు చేసేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. దశాబ్దాల పాటు కొనసాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్‌ పేద రైతుల భూములను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు ఎత్తులు వేస్తోంది. 

లక్షలాది ఎకరాల భూములకు చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ వారి నుంచి వాటిని లాక్కునేందుకు యత్నిస్తోంది. పేదల నుంచి భూములు ఎలా లాక్కోవాలనే అంశంపైనే మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరగడం గమనార్హం. తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేపట్టకుండా వాటన్నింటినీ వివాదాల్లో ముంచెత్తిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో జరిగిన సంస్కరణల కారణంగా ప్రయోజనం చేకూరిన రైతులను ముంచేందుకు కంకణం కట్టుకుని పని చేయడంపై అంతా నివ్వెర­పోతున్నారు. 

భూముల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేయగా అసలు ఎప్పుడూ వీటి గురించి ఆలకించని చంద్రబాబు ప్రభుత్వం పేదలను దగా చేసేందుకు కుతంత్రాలు పన్నుతోంది. 

ఫ్రీహోల్డ్‌ భూములపై పన్నాగాలు
గత ప్రభుత్వం చరిత్రాత్మక రీతిలో అసైన్డ్‌ భూముల సమస్యను పరిష్కరించేందుకు నడుం బిగించి చట్టానికి కీలక సవరణలు చేసింది. దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్న కూటమి ప్రభుత్వం పేదల నుంచి లాక్కునేందుకు పావులు కదుపుతోంది. దీర్ఘకాలంగా భూములపై ఎలాంటి హక్కులు లేకపోవడంతో పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఇతర పేద వర్గాల రైతులు ఎన్నో ఏళ్లుగా కోరుతూ వచ్చిన నేపథ్యంలో నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. 

కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడంతోపాటు మన రైతుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్‌ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌) కల్పించింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్‌ రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడంతో వారు ప్రైవేట్‌ భూముల తరహాలో తమ భూములకు హక్కుదా­రుల­య్యారు. 

ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్‌ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ చేసి పేద రైతులను భూ యజమానులుగా చేసింది. హక్కులు దక్కిన రైతుల్లో కొందరు తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అవసరాల కోసం వాటిని అమ్ముకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని తప్పుబడుతోంది. నిజానికి ఇలా క్రయ విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. 

మిగిలిన భూములన్నీ అసైనీల చేతుల్లోనే భద్రంగా ఉన్నాయి. రైతులకు మేలు చేసిన ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతూ ఈ భూములన్నీ అక్రమమని చెబుతూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.

10 లక్షల ఎకరాలు సక్రమమేనని కూటమి సర్కారు విచారణలోనే వెల్లడి
గత 6 నెలల నుంచి ఫ్రీహోల్డ్‌ భూములపై కూటమి ప్రభు­త్వం విచారణ చేయిస్తూనే ఉంది. సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగా ఫ్రీ హోల్డ్‌ అయినట్లు ఈ విచారణలో తేలింది. మిగిలిన దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని పేర్కొంటున్నా అవి ఏమిటనే అంశాలను కచ్చితంగా తేల్చలేకపోయింది. కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాల్లో ఫ్రీహోల్డ్‌ భూములపై వివా­దాలు సృష్టించినట్లు స్పష్టమవుతోంది. 

ఎక్కడైనా అధికా­రులు, భూ మాఫియాల వల్ల పొరపాట్లు జరిగితే సరిది­ద్దాల్సిందిపోయి వాటన్నింటినీ కబళించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. ఆంక్షల చెరలో చిక్కుకుని దశాబ్దా­లుగా అన్యాయమైపోయిన రైతులకు మేలు జరగడాన్ని జీర్ణించుకోలేక వారి నుంచి ఏకంగా భూములు లాక్కునేందుకు పన్నాగాలు పన్నడంపై పేదలు కలవరం చెందుతు­న్నారు. రాజధానిలో అసైన్డ్‌ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన అసైన్డ్‌ రైతుల భూములను కూడా కొట్టేసేందుకు సిద్ధం కావడంపై పేదలు మండిపడుతున్నారు. 

చట్టబద్ధంగా అసైన్డ్‌ భూముల చట్టా­నికి సవరణ చేసి గత ప్రభుత్వం నిర్వహించిన మంచి పనిని సైతం వక్రీకరించి 22 ఏ జాబితా నుంచి తొలగించిన భూము­లన్నీ అన్యాక్రాంతమైనట్లు మంత్రులు, టీడీపీ నేతలు అడ్డగోలుగా ఆరోపణలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఫ్రీ హోల్డ్‌ అయిన 13 లక్షల ఎకరాల్లో రిజి­స్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు మాత్రమేనని టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది. 

ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వాటిపై విచారణ నిర్వహించి మిగిలిన భూము­లపై ఆంక్షలు ఎత్తి వేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. జగన్‌ హయాంలో జరిగిన మేలు కొనసాగకూడదనే రీతిలో లక్షలాది ఎకరాలను వివాదాస్పదంగా మార్చేసింది.  

పేదల ఇళ్లపైనా పగ
గత ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఇళ్లపైనా చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. ఇళ్లు కట్టుకోలేదనే నెపంతో జగనన్న కాలనీల్లో వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొందరు అక్రమంగా ఇళ్లు పొందారని చెబుతూ పేదల కడుపు కొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారి పరిస్థితి ప్రశ్నార్థకమైంది. 

వారికిచ్చిన స్థలాలను రద్దు చేసి తిరిగి ఎక్కడ ఇస్తారో చెప్పడం లేదు. ఇచ్చిన స్థలాలను రద్దు చేయడంపై పేదలు గగ్గోలు పెడుతున్నా ఆలకించడం లేదు. అదే రీతిలో రాష్ట్రంలో అనేక చోట్ల లక్షలాది మంది పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకునేందుకు సన్నద్ధం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement