నేడు తీరం దాటనున్న 'యాస్‌'

Yaas‌ cyclone strengthened further and Became the most severe storm - Sakshi

బెంగాల్, ఒడిశాలకు ముప్పు

పారాదీప్, సాగర్‌ ఐల్యాండ్స్‌ మధ్య తీరం దాటే అవకాశం

గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న యాస్‌

తిప్పలవలస తీరంలో 10 మీటర్ల ముందుకు వచ్చిన సముద్రం

రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు.. మరో 3 ప్రత్యేక రైళ్ల రద్దు

నేడు కోస్తా జిల్లాల్లో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు

సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ (విజయ నగరం)/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్‌ తుపాను మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 200 కిలోమీటర్లు, బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 290, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారం మధ్యాహ్నం ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్‌ తీరాల్లోని పారాదీప్, సాగర్‌ ఐలాండ్స్‌ మధ్య బాలాసోర్‌కు దక్షిణ దిశలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత 12 గంటల పాటు అతి తీవ్ర తుపానుగానే కొనసాగుతూ 27వ తేదీ ఉదయానికి క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో యాస్‌ తుపాను ప్రభావంపై సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస తీరంలో సముద్రం 10 మీటర్ల ముందుకు వచ్చింది. సముద్రంలో బలంగా గాలులు వీయడం వల్లే సముద్రం ముందుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తీరానికి అనుకుని ఉన్న ఈ గ్రామస్తులు అధికారుల హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. 

రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు
ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వానలు పడతాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో బుధవారం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో సెక్షన్‌ సిగ్నల్‌ నంబర్‌–1, 2, 3తో పాటు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తత సమాచారం అందించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కెరటాల ఉద్ధృతి పెరుగుతుందని తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

పలు జిల్లాల్లో వర్షాలు
గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా అంతటా ఆకాశం మేఘావృతమైంది. తుఫాన్‌ కారణంగా రాజస్థాన్‌ నుంచి పొడిగాలులు రాష్ట్రం వైపుగా వీస్తుండటంతో ఎండలు కూడా పెరుగుతున్నాయి. మాచర్ల, చీమకుర్తి, దొనకొండలో అత్యధికంగా 42 డిగ్రీలు, అవుకు, ఒంగోలు, కలిగిరిల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. 48 గంటల్లో మాల్దీవులతోపాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.

అప్రమత్తమైన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌...
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో యాస్‌ తుపాను ప్రభావం తీవ్రంగాను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రపై స్వల్పంగా ఉండటంతో భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వే వంతెనలు, నదుల సమీపంలోని రైల్వే ట్రాక్స్, యార్డులు, సిగ్నలింగ్‌ వ్యవస్థ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరద ఉధృతికి కాలువలు పొంగి ట్రాక్‌లు దెబ్బతినకుండా ముందస్తు చర్యలుగా పూడికతీత పనులు ప్రారంభించారు.  వాల్తేరు డివిజన్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలూ తుపాను పరిస్థితిని పసిగట్టేందుకు విశాఖ డివిజన్‌తో పాటు భువనేశ్వర్‌లోని హెడ్‌క్వార్టర్స్, ఖుర్దారోడ్, సంబల్‌పూర్‌లలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెల్స్‌ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తుపాను కారణంగా మరో మూడు ప్రత్యేక రైళ్లను రద్దుచేస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 28న యశ్వంత్‌పూర్‌–గౌహతి (06577), చెన్నైసెంట్రల్‌–భువనేశ్వర్‌ (02840), 30న పూరి–చెన్నైసెంట్రల్‌ (02859) రైళ్లను రద్దుచేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top