ఊపిరాడక కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి | Sakshi
Sakshi News home page

ఊపిరాడక కాంట్రాక్ట్‌ కార్మికుడి మృతి

Published Sun, Jan 24 2021 10:44 AM

Worker Died In Coal Mine In Visakhapatnam - Sakshi

సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): బొగ్గుపొడి పడడంతో ఊపిరాడక ఓ కాంట్రాక్టు కార్మికుడు చనిపోయాడు. ఈ దుర్ఘటన ఆలూ ఫ్లోరైడ్‌ సంస్థలో జరిగింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 59వ వార్డు పరిధి హిమచల్‌నగర్‌ కొండ ప్రాంతంలో బమ్మిడి వాసు (50) తన భార్య, కుమారుడు నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. 58వ వార్డు పరిధి ములగాడ విలేజ్‌ ప్రాంతంలోని ఆలూ ఫ్లోరైడ్‌ సంస్థలో నాగరాజు కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నాడు. అతని వద్ద హెల్పర్‌గా వాసు పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధుల్లో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు వాసు సంస్థ ఆవరణలో హాట్‌ ఎయిర్‌ జనరేటర్‌ డిపార్టమెంట్‌ సమీపంలోని స్టాగ్‌ వద్ద పని చేస్తున్నాడు. ఆ సమయంలో స్టాగ్‌లో బొగ్గుపొడి కొలిచే (అల్యూమినియం మరిగించేందుకు వాడే బొగ్గు పొడి) తూనిక స్కేల్‌ (ఇనుప రాడ్‌) స్టాగ్‌ రంధ్రంలో పడిపొయింది. ఆ రాడ్డును తీసేందుకు వాసు ఉదయం 7 గంటల సమయంలో అందులోకి దిగాడు. ఆ సమయంలో బొగ్గుపొడి భారీగా అతనిపై పడిపోవడంతో ఊపిరి ఆడక మృతిచెందాడు.

తండ్రిని ఆ యూనిట్‌ నుంచి వెలుపలకు తీసేందుకు సమీపంలో ఉన్న కుమారుడు నాగరాజు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ వార్డు అధ్యక్షుడు గులిగిందల కృష్ణ, ములగాడ గ్రామం అధ్యక్షుడు ధర్మాల వేణుగోపాలరెడ్డి జరిగిన ప్రమాదాన్ని వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌కు తెలియజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీంతో ఆలూ ఫ్లోరైడ్‌ సంస్థ యాజమాన్యంతో మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడి మృతుని కుటుంబానికి రూ.21 లక్షల పరిహారం ఇప్పించేలా ఒప్పించారు. విషయం తెలుసుకున్న ములగాడ తహసీల్దార్‌ బీవీ రమణి, జీవీఎంసీ 59, 60వ వార్డుల వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు పుర్రె సురేష్‌యాదవ్, పీవీ సురేష్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కొడుకు కాంట్రాక్టు పనులు చేస్తుండడంతో తోడుగా ఉందామని పనికెళ్లిన తండ్రి మృతితో హిమాచల్‌నగర్‌లో విషాదం నెలకొంది.

Advertisement
Advertisement