
ఏరు దాటాక తెప్ప తగలేస్తారా.. ఆడబిడ్డ నిధికి ఎగనామంపై మహిళల మండిపాటు
ఇంటికొచ్చి హామీ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం
ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలా?
మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లెక్కలు తెలియవా?
ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 ఇవ్వాల్సిందే
13 నెలల బకాయి రూ.19,500 వడ్డీతోపాటు చెల్లించాలని డిమాండ్
సాక్షి, అమరావతి: ఎన్నికలప్పుడు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్.. తదితర కూటమి పార్టీల నేతలు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి నిలువునా మోసపోయామని మహిళలు మండిపడుతున్నారు. ‘అప్పుడు.. టీడీపీ నేతలు ఇంటింటికీ వచ్చి, మనిషి మనిíÙని చూపిస్తూ ఆడబిడ్డ నిధి పథకంలో ఏడాదికి నీకు రూ.18,000.. నీకు రూ.18,000 అని చెబితే నిజమేనేమోనని నమ్మాం. అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీల నేతల నిజ స్వరూపం బయట పడుతోంది’ అని దుయ్యబడుతున్నారు.
మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున అందజేస్తామన్న అడబిడ్డ పథకం అమలు చేయాలంటే మన ఆంధ్ర రాష్ట్రాన్నే అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిమ్మల్ని నమ్మిన పాపానికి మహిళలందరినీ నట్టేట ముంచేస్తారా? అని నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయండని అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటారా.. అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికలప్పుడు ఇదే హామీని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటూ ప్రతి బహిరంగ సభలో చెబుతూ ఓట్లు అడిగారు కదా.. ఈ లెక్కలు అప్పుడు తెలియవా? అని తూర్పారపడుతున్నారు.
ఏకంగా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇలా మోసం చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తుతున్నారు. వీళ్ల మాయ మాటలు నమ్మి, గత ప్రభుత్వంలో వచ్చిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. వంటి పలు పథకాల డబ్బులను పొగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కరోనా ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు అమలు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఆ పథకాలేవీ ఆపమని చెబుతూ.. ఇంకా ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి ఇలా మోసం చేయడం తగదని, మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 13 నెలలు పూర్తయినందున రూ.19,500 బకాయిని వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు?
ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినప్పుడు ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? అంటే ఎలాంటి లెక్కలేసుకోకుండానే మేనిఫెస్టో తయారు చేశారా? ఇలా సాకులు చెప్పడం మాని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే.
ఈ పథకం ద్వారా ఏటా రూ.18000 అందుతాయన్న ఆశతో మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నింటినీ అడియాశలు చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందేనంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటించటం మహిళలను మోసగించటమే. ఒక మంత్రిగా ఆయన ఈ మాటలు ఎలా మాట్లాడతారు? ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? – షేక్ నసీరున్నీసా బేగ్, రేపల్లె, బాపట్ల జిల్లా
ప్రతి మహిళకు రూ.19,500 బాకీ
రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు చంద్రబాబు బాకీ ఉన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి 13 నెలలు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం కలుపుకుని రూ.19,500 ప్రతి మహిళకు చంద్రబాబు బాకీ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశారు. మహిళలకు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని దుస్థితిలో కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఇంత దారుణంగా మోసం చేయడం ఎక్కడా ఉండదు. ఈ బాకీ వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. – తోటకూర స్వర్ణలత, పాత గుంటూరు
ఇచ్చిన హామీలు విస్మరించడం దారుణం
గత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్‌తోపాటు అనేక హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ముఖ్యంగా ప్రతి నెలా రూ.1,500 ఆడబిడ్డ నిధిపై మాలాంటి పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని, రేపో మాపో ఇచ్చిన హామీ అమలు అవుతుందని భావించాం. అయితే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్రంలోని మహిళలను మోసగిస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. – సునీత, రెడ్డి కాలనీ, కడప, వైఎస్సార్ కడప జిల్లా
వైఎస్ జగన్ మాటలు నిజమయ్యాయి
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు, ప్రతి సభలోనూ గణాంకాలతో సహా వివరించారు. బాబు మేనిఫెస్టో బూటకమని చెప్పారు. ఇవాళ అదే నిజమైంది. బాబు మహిళల ఓట్ల కోసం అబద్ధపు హామీలు గుప్పించి అధికారం చేపట్టి మహిళలను నట్టేట ముంచారు.
ఇది కూటమి కుట్రలో భాగమే. ఆడబిడ్డ నిధి అంతా బూటకమేనన్న నిజాన్ని మంత్రి తేల్చి చెప్పేశారు. మొన్నామధ్య ముఖ్యమంత్రి సైతం ఇదే అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. దీంతో కూటమి కుట్ర మహిళలకు అర్థమైంది. ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తుందని అనుకోలేదని ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. – ప్రసన్న కుమారి, పరిశోధక విద్యారి్థని, తిరుపతి
ఆడబిడ్డలకు అన్యాయం చేస్తారా?
ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు నోటితో ఈ పథకాన్ని అమలు చేయలేమని చెప్పించడం దుర్మార్గం. ఎవరైనా ఆడబిడ్డలను నమ్మించి మోసం చేస్తారా? చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలోని మహిళలంతా మోసపోయామని ఇప్పుడు బాధ పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు మేలు చేసింది. – కుమారి, గృహిణి, సత్యనారాయణపురం, నెల్లూరు
మీరు చేసిన వాగ్దానమే కదా..
ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1,500 ఇస్తామని మీరు చేసిన వాగ్దానమే కదా మేం అడుగుతున్నది.. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఓ వ్యూహం ప్రకారం ఆయన ఇలా మాట్లాడారని అర్థం అవుతోంది. అది ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికే అని తెలుస్తోంది. ఏమి అమ్మి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేశారో చెప్పాలి. ఆడబిడ్డ నిధి వాగ్దానాన్ని అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మహిళల చేతుల్లో తీవ్ర పరాభవం తప్పదు. – బందెల ప్రమీల, చెరుకువాడ, ఉండి మండలం, పశ్చిమగోదావరి జిల్లా
మరోసారి మోసపోయాం
చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలకు మరోసారి మోసపోయాం. 2014లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికలలో హామీలు అమలు చేస్తామని బాండ్లు ఇచ్చారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా ఉండటంతో హామీలు అమలు జరుగుతాయని నమ్మాం. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన విన్నాక ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామనే హామీ అమలు కాదని స్పష్టమవుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు నోరు విప్పలేదంటే ఆయనే ఈ మాటలు మాట్లాడించారని తెలుస్తోంది. – పోలగల జయ, గృహిణి, సామర్లకోట
మహిళలకు కూటమి ప్రభుత్వం టోపీ
2019 ఎన్నికలప్పుడు వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది. అర్హత కలిగిన మహిళలందరికీ చేయూత, ఆసరా, సున్నావడ్డీ తదితర పథకాల ద్వారా లబ్ధి కలిగింది. అయితే 2024 ఎన్నికల ముందు కూటమి నేతలు అంతకు మించి ఇస్తామని మహిళలను నమ్మించారు.
పైగా ఈ పథకాలన్నీ కొనసాగుతాయని కూడా చెప్పారు. వారి మాయ మాటలకు మోసపోయి అందరూ ఓట్లేశారు. తీరా గద్దెనెక్కాక వారి ప్రతాపం చూపిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని మంత్రి మాట్లాడటం మరోమారు మహిళలకు టోపీ పెట్టడమే. – బంక లక్ష్మి, వేములవలస, విశాఖ జిల్లా