ఉద్యోగినులకు అండగా ఉంటాం

Womens Commission Vasireddy Padma women employees Support - Sakshi

అంతర్గత ఫిర్యాదులపై కమిటీలకు కసరత్తు చేస్తున్నాం

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ 

సాక్షి, అమరావతి/మంగళగిరి: ప్రభుత్వ ఉద్యోగినుల సమస్యలపై కమిషన్‌ సత్వర స్పందనతో అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో ఏపీఎన్జీవో, సచివాలయ మహిళా సంఘాల ప్రతినిధులతో గురువారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.సూయజ్‌ దీనికి అధ్యక్షత వహించారు. పద్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలతో పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలకు కమిషన్‌ కసరత్తు చేస్తుందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగినులు ఫిర్యాదులు చేయడంలో ముందుంటున్నారని తెలిపారు. కనుసైగ సైతం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని గుర్తెరగాలన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు.. గజ్జల వెంకటలక్ష్మి, ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి శాంతకుమారి, ఏపీ సచివాలయ మహిళా అసోసియేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపాభవాని, ఏపీ ఎన్జీవో మహిళా అసోసియేషన్‌ అధ్యక్షురాలు వి.నిర్మలకుమారి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఉద్యోగినులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కాగా, టీడీపీ నేతల బూతులు హేయమని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రిని బూతుల తిట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. మహిళల రక్షణ, భద్రత, సంక్షేమానికి సీఎం వైఎస్‌ జగన్‌ అనేక చర్యలు చేపట్టారని కొనియాడారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top