
సాక్షి, నగరి: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా జాతీయ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా.. కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని రోజా.. కమిషన్‌ను కోరారు. ఇక, అంతకుముందు.. భాను ప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని రోజా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా?
మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి స్పందించారు. ఈ సందర్బంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం తలదించుకునేలా భాను ప్రకాష్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఇంట్లో మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. రోజాకు వెంటనే భాను ప్రకాష్ క్షమాపణ చెప్పాలి. భాను ప్రకాష్‌ను అరెస్టు చేయాలి. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ ఏమైపోయారు. మహిళలను అవమాన పరచడం అనేది టీడీపీ డీఎన్‌ఏనే ఉంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.