అంత్యక్రియలయ్యాక.. ఆమె తిరిగొచ్చింది

Women was alive but people thought she was deceased with Covid - Sakshi

చనిపోయిందనుకున్న మహిళ ప్రత్యక్షం

బెంబేలెత్తిన జగ్గయ్యపేట వాసులు

కరోనాతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన వృద్ధురాలు

మూడు రోజుల తరువాత ఓ మృతదేహాన్ని భర్తకు అప్పగించగా అంత్యక్రియలు జరిపిన వైనం

జగ్గయ్యపేట అర్బన్‌/లబ్బీపేట (విజయ వాడ తూర్పు): చనిపోయిందనుకున్న మనిషి కళ్లెదుట నిక్షేపంలా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట క్రిస్టియన్‌పేట వాసులకు బుధవారం ఎదురైంది. అదే పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేసేది. ఆమె భర్త ముత్యాల గడ్డయ్య కొలిమి పని చేసేవాడు. మానసికంగా అమాయకంగా ఉంటాడు. ఆ దంపతులకు రమేష్‌ (దావీదు) అనే కుమారుడు ఉన్నాడు. గత నెల 12న గిరిజమ్మ కరోనాతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అప్పటికే కరోనాతో ఆమె కుమారుడు దావీదు కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. మే 15న గిరిజమ్మ చనిపోయిందని విజయవాడ ఆస్పత్రి సిబ్బంది ఓ మృతదేహాన్ని ప్యాక్‌ చేసి భర్త గడ్డయ్యకు అప్పగించారు. గడ్డయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అది గిరిజమ్మేనా కాదా అనేది గుర్తించలేకపోయాడు. బంధువులు మృతదేహం వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. అనంతరం ఆ భౌతిక కాయానికి  అంత్యక్రియలు పూర్తి చేయించారు. ఆ తర్వాత మే 23న కుమారుడు దావీదు కూడా చనిపోవడంతో గిరిజమ్మ, దావీదులకు కలిపి పెద్దకర్మను మే 31న నిర్వహించారు. 

నిక్షేపంగా ఆటోలో వచ్చింది
విచిత్రంగా బుధవారం గిరిజమ్మ ఆటోలో నిక్షేపంగా ఇంటికి చేరింది. దీంతో స్థానికులు అవాక్కయ్యారు. తొలుత ఆమెను చూసి భీతిల్లారు. నింపాదిగా ఆమెతో మాట్లాడగా ఆస్పత్రి సిబ్బంది తనను బాగా చూసుకున్నారని, తాను పూర్తిగా కోలుకున్నానని, సిబ్బందే తనను జగ్గయ్యపేటకు ఆటోలో పంపారని గిరిజమ్మ వివరించింది. ఆమె ఇంకా బలహీనంగా ఉండటంతో కుమారుని మరణ వార్తను ఆమెకు చెప్పలేదు. కాగా, అంత్యక్రియలు పూర్తి చేసిన మృతదేహం ఎవరిదా అనేది స్థానికులకు అంతుబట్టడం లేదు. 

గిరిజమ్మ, దావీదుల జ్ఞాపకార్థం బంధువులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ 

మరో వార్డుకు మార్చడం వల్లే..
మే 12న ఆస్పత్రిలో చేరిన గిరిజమ్మను మెరుగైన వైద్యం  కోసం సిబ్బంది మరో వార్డుకు మార్చారు. ఆ తర్వాత 15న గిరిజమ్మ భర్త గడ్డయ్య ఆస్పత్రికి వచ్చి భార్య కోసం ఆరా తీయగా.. తొలుత చేరిన బెడ్‌పై ఆమె లేదని అప్పుడు డ్యూటీలో ఉన్న సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో చనిపోయిందేమోనని భావించి గడ్డయ్య మార్చురీకి వెళ్లాడు. అక్కడ 60 ఏళ్ల మహిళ మృతదేహం ఉండటంతో అది గిరిజమ్మదేనేమో చూడాలని సిబ్బంది గడ్డయ్యకు సూచించారు. ఆ మృతదేహాన్ని చూసిన అతడు అది తన భార్యదేనని చెప్పి తీసుకెళ్లాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

బంధువులు గుర్తిస్తేనే ఇస్తున్నాం 
మార్చురీలో మృతదేహాలను బంధువులు గుర్తించిన తర్వాతే అప్పగిస్తున్నాం. మృతదేహం తన భార్యదేనని గడ్డయ్య చెప్పడంతో ఇచ్చాం. ఆస్పత్రిలో మరో వార్డులో చికిత్స పొందుతున్న గిరిజమ్మను ఈ రోజు డిశ్చార్జ్‌ చేశాం.  
– డాక్టర్‌ ఎ.హనుమంతరావు, ఆర్‌ఎంవో 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top