అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాం  | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాం 

Published Sat, Apr 22 2023 4:40 AM

We will clamp down on illegal mining - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 5994599 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2014–19 మధ్య అక్రమ మైనింగ్‌పై 424 కేసులు నమోదవగా, 2019–22 మధ్యలో 643 కేసులు నమోదైనట్లు చెప్పారు.

అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం అటవీ భూములు, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించినట్లు తెలిపారు. ద్రవిడ విశ్వ విద్యాలయం భూముల్లో 131 గ్రానైట్‌ బ్లాకులను సీజ్‌ చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో 2014 నుంచి 2019 వరకు అక్రమ మైనింగ్‌పై కేవలం 38 కేసులు నమోదు చేయగా, 2019 నుంచి 2023 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం వల్ల 96  కేసులు నమోదయ్యాయన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు 2014–19 మధ్య కాలంలో బినామీల ద్వారా పెద్ద ఎత్తున లేటరైట్‌ అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. దానిపైనా చర్యలు తీసుకుని జరిమానా విధించామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పలు సంస్కరణల వల్ల మైనింగ్‌ ఆదాయం భారీగా పెరిగిందన్నారు. 2018–19 ఆరి్థక సంవత్సరంలో వార్షిక మైనింగ్‌ రెవెన్యూ రూ.1,950 కోట్లు కాగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.4,756 కోట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో గ్రావెల్, రోడ్‌ మెటల్‌ మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో 41.62 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.12.62 కోట్ల మైనింగ్‌ ఆదాయం లభించిందని చెప్పారు. 2019–22 వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 65.24 కోట్ల ఆదాయం లభించిందన్నారు. గత ప్రభుత్వం కంటె ఈ ప్రభుత్వంలో మూడేళ్ళలోనే నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement