టీడీపీ మునస్వామి.. థామస్‌ ఎలా అయ్యాడు? | Sakshi
Sakshi News home page

టీడీపీ మునస్వామి.. థామస్‌ ఎలా అయ్యాడు?

Published Sat, Mar 30 2024 12:15 PM

VM Thomas Contesting elections with false documents   - Sakshi

మాయలోడు థామస్‌?

జీడీనెల్లూరు టీడీపీ అభ్యర్థి మతం, విద్యార్హతపై ఫిర్యాదులు

ఇంటర్మీడియెట్‌ టీసీలో మునస్వామి.. కులధ్రువీకరణ పత్రంలో మునస్వామి థామస్‌ 

అమాయక ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపణ

 సమగ్ర విచారణకు ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి

‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు

ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు

కాషే ఉంటే ఫేస్‌కు విలువస్తుంది

 నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్‌ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్‌ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్‌ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్‌గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్‌) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్‌కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్‌ మిట్టపల్లి సతీష్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

ఇంటర్మీడియెట్‌ కోర్సు ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌ చేయకున్నప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్‌ అనే క్రిస్టియన్‌ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్‌ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్‌ నామినేషన్‌ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు.

తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ
క్రైస్తవ మతం స్వీకరించిన థామస్‌కు ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్‌ చదవక పోయినా పీహెచ్‌డీని అడ్డుపెట్టుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్‌గా పనిచేసి మానేసిన డాక్టర్‌ ఎస్‌.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం
2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్‌కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బర్‌బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్‌ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు.

థామస్‌ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్‌ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్‌ అని పాస్‌పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్‌పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్‌ నోటిఫికేషన్‌ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు.

వీటిపై సమగ్ర విచారణ

1.ఇంటర్‌ సర్టిఫికేట్‌లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్‌పోర్టులో వీ.ఎం.థామస్‌గా ఎలా మారింది?

2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్‌పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం?

3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్‌ పొందిన వ్యక్తా?

4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా?

పకడ్బందీగా విచారణ
ఆధార్‌ కార్డులో వీ.ఎం, థామస్‌ అని ఉంది. ఏప్రిల్‌ 2022లో పనిచేసిన తహసీల్దార్‌ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను.
– పుష్పకుమారి, తహసీల్దార్‌, కార్వేటినగరం మండలం

Advertisement

తప్పక చదవండి

Advertisement