Visakhapatnam: Constables Collecting Money By Using SI, CI Names - Sakshi
Sakshi News home page

అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. 5 కిలోల చికెన్‌ కొట్టి ఇవ్వు.!

Published Mon, Feb 6 2023 5:24 PM

Visakhapatnam Constables Collecting Money By Using Si Name - Sakshi

దొండపర్తి(విశాఖ దక్షిణ): అయ్యగారు పార్టీ ఇస్తున్నారు. 5 కిలోల చికెన్‌ కొట్టి ఇవ్వు.! ఓయ్‌.. ఇన్‌స్పెక్టర్‌ గారి ఇంట్లో ఫంక్షన్‌.. నువ్వు బియ్యం బస్తాలు ఇవ్వాలి.! ఇదిగో.. మా సార్‌ కోసం మసాలా ఐటెమ్స్‌ కట్టేసి బ్యాగ్‌లో పెట్టు.! ఇదీ నగర శివారు ప్రాంతమైన పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్, పోలీస్‌ కానిస్టేబుళ్ల దందా.. 

సీఐ పార్టీ ఇస్తున్నారని చెప్పి.. ఆ స్టేషన్‌ పరిధిలోని చికెన్‌ షాపుల నుంచి కిరాణా షాపుల వరకు ప్రతి ఒక్కరినీ దోచుకుతింటున్నారు ఖాకీలు. కొంత మంది కానిస్టేబుళ్లు ఉదయం నుంచే బ్యాగులు పట్టుకుని షాపుల మీద పడ్డారు. చికెన్‌ షాపుల వద్దకు వెళ్లి సీఐ ఇంట్లో ఫంక్షన్‌ ఉందని ఒకరు.. సీఐ పార్టీ ఇస్తున్నారని మరొకరు చెప్పి 2 కిలోల నుంచి 5 కిలోల వరకు డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోయారు. రోజు వారి వ్యాపారంపై జీవనం సాగించే ఇటువంటి చిన్న వ్యాపారుల నుంచి కిలోలకు కిలోలు చికెన్‌ కొట్టేయడంతో వారు బయటకు చెప్పుకోలేక మదనపడుతున్నారు. అలాగే రిటైల్‌ దుకాణాలకు వెళ్లి రైస్‌ బ్యాగులు, ఇతర వంట, మసాల సామాన్లు సైతం కట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయారు.  

ప్రతిసారీ అదే తంతు 
ఈ స్టేషన్‌ సిబ్బంది వ్యవహారం పట్ల స్థానిక వ్యాపారులు విసుగెత్తిపోతున్నారు. ఖాకీ డ్రెస్‌ ఉందన్న కారణంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీఐ పేరు చెప్పి సాగిస్తున్న ఈ దందా నిజంగా ఇన్‌స్పెక్టర్‌ కోసమా? లేదా కానిస్టేబుళ్ల నిర్వాకమా? అన్నది తేలాల్సి ఉంది. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి మార్కెట్‌ దందా చేయడంలో ఈ స్టేషన్‌ పరిధిలో సిబ్బంది సిద్ధహస్తులుగా పేరుపొందారు. చిరు వ్యాపారులు, దుకాణదారుల నుంచి ఉచితంగా సామాన్లు పట్టుకుపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నా.. ఆ తర్వాత మిగిలిన వారు తమపై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తారన్న భయంతో వ్యాపారులు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. 

సీఐ వ్యవహార శైలి అంతే..  
ఈ స్టేషన్‌ సీఐ వ్యవహారం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. విందులు, వినోదాలపై అమితాసక్తి ఉన్న ఈ అధికారి పనిచేసిన చోటల్లా ఏదో వివాదంలో చిక్కుకుంటూ వస్తున్నాడు.  కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల నుంచి మందలింపులతో పాటు ఓ మహిళ వివాదం విషయంలో సస్పెన్షన్‌కు సైతం గురయ్యాడు. అయినప్పటికీ అతని వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదని సహచర సిబ్బందే చెబుతుండడం గమనార్హం. ఓ అతిథి గృహంలో పార్టీ కోసమే కానిస్టేబుళ్లు మార్కెట్‌లో దందాకు దిగారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా సీఐయే కానిస్టేబుళ్లకు చెప్పి పంపించాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఇటువంటి సిబ్బందిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.

Advertisement
Advertisement