10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి: సీఎం జగన్‌

Vanijya Utsavam 2021: CM Jagan Inaugurates Vanijya Utsavam At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని సీఎం తెలిపారు.  రెండేళ్లలో​ రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా  55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.

విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్‌- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు  చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్‌ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.      

3 వేల మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గెయిల్‌తో కలిసి గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధికి 25 ప్రపంచస్థాయి కళాళాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్రం 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి, రూ. 2,500 కోట్ల పెట్టుబడితో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్క్ష్యమని అన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. ఫార్మా  ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ ఎగుమతులకు భారీ అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ వారంలోనే ఎక్స్‌పోర్టు కాన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోర్టు కాన్‌క్లేవ్‌ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని తెలిపారు. వాణిజ్యంలో దేశంలోని ఏ రాష్ట్రంతోనైనా పోటీ పడే సత్తా ఏపీకి ఉందని పేర్కొన్నారు. వాణిజ్యం పెంపుకు, మౌలిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని తెలిపారు. కోవిడ్‌ కష్టాలున్నా ఏపీలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top