దుస్తులు పాతబడ్డాయా.. అమ్మేయండి..! | Used clothes also earn money | Sakshi
Sakshi News home page

దుస్తులు పాతబడ్డాయా.. అమ్మేయండి..!

Dec 21 2024 5:47 AM | Updated on Dec 21 2024 5:47 AM

Used clothes also earn money

వాడేసిన దుస్తులకూ డబ్బులొస్తాయి

ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌లు, వెబ్‌ సైట్లు

డబ్బులిచ్చి పాత దుస్తులు కొంటున్న సంస్థలు

కొన్ని యాప్‌లలో ధర  ర్ణయాధికారం అమ్మేవారిదే

కొన్ని యాప్‌లు దుస్తులను బట్టి ధర నిర్ణయిస్తాయి

ఇంటికే వచ్చి తీసుకెళ్తారు

నేరుగా మనమే కొనేవారికి అమ్మే వెసులుబాటూ ఉంది

సాక్షి, అమరావతి: ఇంటినిండా బట్టలున్నట్టే ఉంటాయి. కానీ సమయానికి కట్టుకుందామంటే ఒక్కటీ సరైనది కనిపించదు. ఇలా పాతబడిపోయిన దుస్తులను ఏం చేయాలో తెలియదు. ఎవరికైనా ఇద్దామంటే ఏమనుకుంటారోననే సందేహం. వాటిని దాచుకోలేక, పడేయలేక సతమతమవుతుంటారు చాలామంది. ముఖ్యంగా మహిళలు. ఇకపై ఆ సందేహాలు, సతమతాలు అవసరం లేకుండా ఇళ్లల్లో ఉన్న పాత దుస్తులను కొనే యాప్‌లు, వెబ్‌సైట్‌లు వచ్చేశాయి. 

వీటిద్వారా వాడకుండా పక్కన పెట్టేసిన దుస్తులను ఆన్‌లైన్‌లో అమ్మేసేయొచ్చు. అంటే..పాత దుస్తులకూ డబ్బులొస్తాయన్నమాట. వాటిని కొనేందుకు కొన్ని వెబ్‌సైట్‌లు ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఆలస్యమెందుకు.. ఆ యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఏమీటో తెలుసుకొని.. పాత వాటిని అమ్మేద్దాం..

అమ్మడానికి ఆన్‌లైన్‌లో అనేక వేదికలు
ఆన్‌లైన్‌ల్‌లో పాత దుస్తులు కొనే వెబ్‌ సైట్‌లు, యాప్‌లు చాలానే ఉన్నాయి. ప్రీ అప్, బేచ్‌ దే, పోష్‌ మార్క్, ఓఎల్‌ఎక్స్, పీ పాప్, ఒయేలా, క్లాతింగ్‌ క్లిక్, ఈబే, ఓల్డ్‌ కార్ట్‌..వంటి పేర్లతో ఆన్‌లైన్‌ వ్యాపారాలు జరుగుతున్నాయి. కొన్ని సైట్లు, యాప్‌లు నేరుగా దుస్తులు కొనుగోలు చేసి వాటికి కొంత నగదును ఇస్తున్నాయి. అందుకోసం మీ దుస్తులను యాడ్‌ చేసి ధరను నిర్ణయించిన తర్వాత, కంపెనీ వాటిని చెక్‌ చేసి ఆమోదిస్తుంది. అనంతరం వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయిస్తుంది. 

మరికొన్ని వినియోగదారులకు నేరుగా అమ్మకందారులే దుస్తులను విక్రయించేందుకు అవకాశం ఇస్తున్నాయి. ఈ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకుని లాగిన్‌ అయ్యాక సేల్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి, అమ్మాలనుకుంటున్న దుస్తులను క్లోజప్‌లో ఫొటో తీసి పోస్ట్‌ చేయాలి. వాటికి సంబంధించిన చిన్నపాటి సమాచారం (డిస్క్రిప్షన్‌)ను కూడా రాయాలి. ఆ తర్వాత డ్రెస్‌ ఏ కండీషన్‌లో ఉంది, ఎవరికి సరిపోతుంది (కేటగిరీ) అనే వివరాలను  సెలక్ట్‌ చేసి దాని ధర (అమౌంట్‌) ను కూడా తెలపాలి. 

కొన్ని సంస్థలు అమ్మకం రుసుము (సెల్లింగ్‌ ఫీజు) తీసుకోవు. ఇంటికే వచ్చి మనం అమ్మిన పాత దుస్తులను తీసుకెళుతున్నాయి. దుస్తులు అమ్మే సమయంలో క్రెడిట్‌ పాయింట్స్‌ లేదా క్యాష్‌ ఆప్షన్‌ పెట్టుకునే వీలు కూడా ఉంటుంది. బట్టలతో పాటు వాచీలు, చైన్లు, రింగులు, క్యాపులు, బూట్లు వంటి యాక్ససరీస్, డెకరేటివ్‌ ఐటమ్స్‌ కూడా అమ్ముకునేలా, కొనుక్కునేలా ఈ యాప్‌లలో ఆప్షన్లు ఉన్నాయి. మీషో వెబ్‌సైట్‌లో దేశవ్యాప్తంగా ఎవరైనా మీ దుస్తులను కొనే అవకాశం ఉంటుంది. 

ఫ్రీఅప్‌ అనే వెబ్‌ సైట్‌ కూడా మరో ఫేమస్‌ వెబ్‌ సైట్‌. ఈ యాప్‌ లో మీరు మీ పాత బట్టల ఫొటోలు పెట్టగానే వాటి క్వాలిటీని బట్టి ధర నిర్ణయిస్తుంది. ధర నచ్చితే హ్యాపీగా అమ్మేయొచ్చు. రీలవ్‌ వెబ్‌ సైట్‌ ద్వారా కూడా ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోవచ్చు. క్లెటెడ్‌ అనేది ప్రత్యేకంగా ఇంటింటికీ సేవలందించడంలో ప్రసిద్ధి చెందిన యాప్‌. వెబ్‌ సైట్‌ నిర్వాహకులే ఇంటికొచ్చి పాత దుస్తుల బ్రాండ్, ప్రస్తుత పరిస్థితిని చూసి సరైన ధర నిర్ణయించి డబ్బులు కూడా ఇస్తారు. 

వ్యాపారం మీరే చేయొచ్చు
ఆన్‌లైన్‌లో పాత దస్తులను సేకరించి విక్రయించే వ్యాపారం చేయడానికి ఇటీవల యువత కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కొంత మంది లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. ఒక యాప్‌ లేదా వెబ్‌ సైట్‌  తయారు చేసి సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేయొచ్చు. నగరాల్లో కమిషన్‌ పద్ధతిలో సిబ్బందిని నియమించుకుని దుస్తులు సేకరించవచ్చు. వాటిని రీసైక్లింగ్‌ చేసే కంపెనీలకు బల్‌్కగా అమ్మొచ్చు. 

ఇలా కొన్న పాత బట్టలను ఉపయోగించి కొందరు పిల్లోస్, పరుపులు, డెకరేషన్‌ ఐటమ్స్‌ తయారు చేస్తారు. అలాంటి వారిని సంప్రదించి మంచి ధరకు అమ్మేయొచ్చు. దీని ద్వారా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement