అదుపులోకి విద్యుత్‌ కొరత

Uninterrupted power supply to households without any cuts - Sakshi

గృహావసరాలకు కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా

వ్యవసాయానికి 7 గంటలు పగటిపూట కరెంట్‌

నెలాఖరు నాటికి పరిశ్రమలకు పూర్తిస్థాయిలో సరఫరాకు చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలతో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత అదుపులోకి వస్తోంది. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి సైతం పగటిపూట 7 గంటల విద్యుత్‌ అందుతోంది. 

11.40 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు
రాష్ట్రంలో మంగళవారం 226 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా.. ఏపీ జెన్‌కో, ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, జల, సౌర, పవన, గ్యాస్‌ ఆధారిత కేంద్రాల ద్వారా మొత్తం 197 మిలియన్‌ యూనిట్లు అందుబాటులో ఉంది. 29 మిలియన్‌ యూనిట్లు లోటు ఏర్పడటంతో బహిరంగ మార్కెట్‌ నుంచి డిస్కంలు 11.40 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేశాయి. వ్యవసాయ రంగానికి 7 గంటలు, గృహావసరాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి 17.6 మిలియన్‌ యూనిట్ల మేర లోడ్‌ రిలీఫ్‌ అమలు చేసినట్లు ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంటలు చాలా వరకూ కోతలు పూర్తవ్వడం, కొన్ని పంటలు చివరి దశలో ఉన్నందున వ్యవసాయావసరాలకు రోజుకి 7 గంటలు విద్యుత్‌ సరఫరా సరిపోతుందని, అయినప్పటికీ కొన్ని చోట్ల 9 గంటలు విద్యుత్‌ సరఫరా ఇస్తున్నామని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్‌.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు.

నెలాఖరుకు పరిశ్రమలకూ సంపూర్ణంగా..
ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పవర్‌ హాలిడేలో భాగంగా ఈ నెల 11 వరకూ పరిశ్రమలకు 72.04 మిలియన్‌ యూనిట్ల లోడ్‌ రిలీఫ్‌ ఇచ్చినట్లు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పరిశ్రమలకు కూడా పూర్తిస్థాయి సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కొన్ని పరిశ్రమలకు ముందు, మిగతా వాటికి తరువాత దశల వారీగా నియంత్రణలు తొలగిస్తామని ఆయన వెల్లడించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top