వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం.. ఏపీలో రైతన్నలకు విరివిగా రుణాలు.. ఆర్‌బీఐ తాజా గణాంకాలు

Under rule of YSRCP Government Farmers got Ample Loans: RBI - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో రైతన్నలకు విరివిగా రుణాలు లభ్యమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకు వరుసగా నాలుగేళ్లు రైతులకు బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు విరివిగా మంజూరయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే.

అలాగే సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులకు సున్నా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో బ్యాంకులు రైతులకు వ్యవసాయ రుణాలను ఏడాదికేడాదికి పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. దీంతో బాబు ఐదేళ్ల పాలనలో బ్యాంకుల నుంచి రైతులకు వ్యవసాయ రుణాల మంజూరు అంతకంతకూ తగ్గిపోతూ వచ్చింది. బాబు హయాంలో బ్యాంకులు రైతులకు వ్యవసాయ రుణాల మంజూరు తగ్గించేయడానికి ప్రధాన కారణం.. ఆయన రుణమాఫీ చేస్తానని చేయకపోవడమేనని వెల్లడైంది.  

60.16 శాతం మేర పెరిగిన వ్యవసాయ రుణాల మంజూరు.. 
ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రుణాల మంజూరు 10.32 శాతం మేర తగ్గిపోయింది. మరోవైపు అదే సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో గత నాలుగేళ్లలో బ్యాంకుల నుంచి రైతులకు వ్యవసాయ రుణాల మంజూరు ఏకంగా 60.16 శాతం మేర పెరిగింది. 2014 మార్చి నాటికి వ్యవసాయ రుణాలు రూ.1,18,200 కోట్లు ఉండగా.. 2018 నాటికి ఈ మొత్తం రూ.1,06,000 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో 2022 మార్చి నాటికి రూ.1,80,601 కోట్లకు వ్యవసాయ రుణాలు పెరిగాయి.   

దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికం.. 
మరోవైపు దేశం మొత్తం మీద బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాల మంజూరు అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2022 మార్చి నాటికి దేశం మొత్తం మీద రూ.17,03,315 కోట్లను బ్యాంకులు వ్యవసాయ రుణాలుగా మంజూరు చేశాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు అత్యధికంగా రూ.7,66,911 కోట్లను మంజూరు చేయడం విశేషం.

అంటే.. దేశం మొత్తం మీద మంజూరు చేసిన వ్యవసాయ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాలకే 45.02 శాతం రుణాలు మంజూరయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో అత్యధికంగా రూ.2,52,472 కోట్ల రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రూ.1,80,601 కోట్లను మంజూరు చేశాయి. అలాగే కర్ణాటకలో రూ.1,37,241 కోట్లు, కేరళలో రూ.92,121 కోట్లు, తెలంగాణలో రూ.1,00,645 కోట్ల వ్యవసాయ రుణాలను మంజూరు చేసినట్టు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top