రాష్ట్రానికి రెండు శౌర్య పతకాలు

Two shourya medals to AP Police officers - Sakshi

ఏఏసీ గొంగటి గిరీష్, జేసీ కూడుపూడి హరికృష్ణకు ప్రకటించిన కేంద్ర హోం శాఖ

ఏసీబీ అధికారి ఎం.శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం

మరో 15 మందికి పోలీసు ప్రతిభా పతకాలు ప్రకటించిన కేంద్ర హోం శాఖ

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం మెడల్స్‌ ప్రకటించింది. ఏపీకి రెండు పోలీస్‌ శౌర్య పతకాలు, ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకంతో పాటు 15 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఏఏసీ ర్యాంకు అధికారి గొంగటి గిరీష్‌ కుమార్, జేసీ ర్యాంకు అధికారి కూడుపూడి హరికృష్ణకు పోలీసు శౌర్య పతకాలు వచ్చాయి. విజయవాడ ఏసీబీ అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మాథుర్తి శ్రీనివాసరావుకు రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం దక్కింది. 

15 పోలీస్‌ మెడల్స్‌.. 
పీహెచ్‌డీ రామకృష్ణ(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్, విజయవాడ), మల్లూర్‌ కుప్పుస్వామి రాధాకృష్ణ(అడిషనల్‌ ఎస్పీ, కర్నూలు), రావెల విజయపాల్‌(అడిషనల్‌ ఎస్పీ, సీఐడీ), గంటా వెంకటరమణమూర్తి (సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి, నందిగామ), సదాశివుని వరదరాజు(విజిలెన్స్‌ ఎస్పీ, ఏలూరు), ఆలపాటి వెంకటేశ్వరరావు (అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఏపీఎస్పీ 6వ బెటాలియన్, మంగళగిరి), నంబూరు నారాయణ మూర్తి (జేఆర్‌ పురం ఔట్‌పోస్ట్‌ ఎస్‌ఐ, శ్రీకాకుళం), జొన్నల విశ్వనాథం(ఇంటెలిజెన్స్‌ ఏఎస్‌ఐ, విజయవాడ), సోమ శ్రీనివాసులు (ఏసీబీ ఎస్‌ఐ, తిరుపతి), యెండ్లూరు శ్యామ సుందరం(ఇన్‌స్పెక్టర్, పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్, కళ్యాణి డ్యామ్‌), జమ్మలమడుగు నూర్‌ అహ్మద్‌ బాషా (ఏఎస్‌ఐ, వన్‌టౌన్, మదనపల్లి), ఎర్రబోలు నాగేశ్వరరెడ్డి (ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ హెడ్‌ కానిస్టేబుల్, హోంగార్డ్‌ యూనిట్, విజయవాడ), మడియ జనార్ధన్‌ (హెడ్‌ కానిస్టేబుల్, ఆక్టోపస్‌), దాచూరు సురేష్‌బాబు (ఏఎస్‌ఐ, స్పెషల్‌ బ్రాంచ్, నెల్లూరు), ఎన్ని శశిభూషణ్‌రావు (రిజర్వ్‌ ఎస్‌ఐ, ఏపీఎస్పీ 5వ బెటాలియన్, విజయనగరం)లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీస్‌ ప్రతిభా పతకాలకు ఎంపిక చేసింది. అలాగే ఢిల్లీ పోలీసు విభాగంలో ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన అధికారి డాక్టర్‌ జి.రాంగోపాల్‌నాయక్‌కు కూడా పోలీస్‌ శౌర్య పతకం వరించింది. 

ఇతర బలగాల్లో పనిచేస్తున్న అధికారులకు..
రాష్ట్రానికి సంబంధించి ఇతర బలగాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులకు కూడా పురస్కారాలు లభించాయి. సతీష్‌ కుమార్‌(కమాండెంట్, సీఆర్‌పీఎఫ్‌ 42వ బెటాలియన్, రాజమండ్రి), ఆదిగర్ల లక్ష్మణమూర్తి(అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, వైజాగ్‌ స్టీల్‌ ప్రాజెక్ట్‌ యూనిట్, సీఐఎస్‌ఎఫ్‌), లవ్‌కుమార్‌ (సెకండ్‌ ఇన్‌ కమాండ్, 10వ బెటాలియన్‌ గుంటూరు, ఎన్డీఆర్‌ఎఫ్‌)లకు పోలీస్‌ ప్రతిభా పురస్కారాలు వచ్చాయి. అలాగే జైళ్ల శాఖలో పనిచేస్తున్న ఎం.అరుణ్‌కుమార్‌ (చీఫ్‌ వార్డర్, ఏపీ), అరిగెల రత్నరాజు (హెడ్‌ వార్డర్, ఏపీ)లకు ఖైదీల ప్రవర్తన దిద్దుబాటుకు గానూ అత్యుత్తమ సేవా పురస్కారాలు లభించాయి. 

ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే..
ప్రస్తుతం ఏసీబీలో ఏఆర్‌ ఎస్సైగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసరావు ఇప్పటివరకు 50 నగదు అవార్డులు, 11 పురస్కారాలు, 49 కమాండేషన్స్, 9 అభినందన పత్రాలు అందుకున్నారు. 2014 రిపబ్లిక్‌ డే సందర్భంలో పోలీస్‌ మెడల్‌ అందుకున్నారు. తాజాగా ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపికయ్యారు. ‘రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం నా బాధ్యతను మరింత పెంచింది. దీనికి నన్ను ఎంపిక చేసిన కేంద్రానికి, ప్రోత్సహించిన సీఎం వైఎస్‌ జగన్, డీజీపీ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని శ్రీనివాసరావు తన సంతోషం వ్యక్తం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top