హైకోర్టు జడ్జిలుగా మరో ఇద్దరు 

Two more as Andhra Pradesh High Court Judges - Sakshi

న్యాయమూర్తుల పోస్టులకు జ్యోతిర్మయి, గోపాలకృష్ణారావుల పేర్ల సిఫారసు 

సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం 

వీరి నియామకంతో న్యాయాధికారుల కోటా పూర్తి 

మిగిలిన 5 ఖాళీలు న్యాయవాదుల కోటా నుంచే భర్తీ 

త్వరలో పేర్లు పంపనున్న హైకోర్టు కొలీజియం

సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారుల కోటా నుంచి పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపాలకృష్ణారావుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనుంజయ్‌ యశ్వంత్‌ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది.

ఈ ఇద్దరి పేర్లను కేంద్రానికి పంపింది. వీరికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ఆ ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు తరువాత వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఆ తరువాత వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది.  

ఇక ఈ ఇద్దరు న్యాయాధికారుల్లో వెంకట జ్యోతిర్మయి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి (పీడీజే)గా వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణ గుంటూరు మొదటి అదనపు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి పేర్లను హైకోర్టు కొలీజియం నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టుకు పంపింది. వీరిద్దరి నియామకంతో ప్రస్తుతానికి న్యాయాధికారుల కోటా పూర్తవుతుంది.

ఇదే సమయంలో వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. అలాగే, హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా.. మరో ఐదు ఖాళీలుంటాయి. ఇవి న్యాయవాదుల కోటాకు సంబంధించినది. వీటిని సైతం భర్తీచేసేందుకు హైకోర్టు కొలీజియం త్వరలో న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు ప్రతిపాదించనుంది. మరోవైపు.. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. 

పి. వెంకట జ్యోతిర్మయి 
గుంటూరు జిల్లా, తెనాలిలో బాలాత్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి దంపతులకు జన్మించారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెనాలిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. చదువులో టాపర్‌. మూడు బంగారు పతకాలు సాధించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పనిచేశారు. 2022 ఏప్రిల్‌ 18 నుంచి ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు  
కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామంలో కోటేశ్వరమ్మ, సోమయ్య దంపతులకు జన్మించారు. తండ్రి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేశారు. పదవ తరగతి మ­చి­లీపట్నం జైహింద్‌ పాఠశాలలో చదివారు. ఇంటర్‌ ఎస్‌ఆర్‌ వైఎస్‌పీ జూనియర్‌ కాలేజీలో పూర్తిచేశారు. డిగ్రీ, పీజీ మచిలీపట్నంలో చదివారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యా­రు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు.

2016లో జిల్లా జడ్జిగా ప­దో­న్నతి పొందారు. గుంటూరు మొ­దటి అద­నపు జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీరి కుటుంబంలో న్యాయాధికారి అయిన మొ­ద­టి వ్యక్తి ఈయనే. కుమారుడు వి.రఘునాథ్‌ ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై ప్రస్తుతం కర్నూలు జిల్లా, ఆత్మకూరు కోర్టులో పనిచేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top