తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం 

TTD parveta utsavam was held in solitude on At Tirumala Srivari Temple - Sakshi

తిరుమల: శ్రీవారి ఆలయంలో ఆదివారం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ నాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు మలయప్పస్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు 3 సార్లు స్వామి వారి తరఫున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. 

శ్రీవారి ఆలయంలో ఘనంగా ‘కాకబలి’ 
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ‘కాకబలి’ కార్యక్రమం ఆదివారం వైదికోక్తంగా జరిగింది. అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు. 

వరాహస్వామివారికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం 
తిరుమల వరాహస్వామివారి ఆలయంలో ఆదివారం మండలాభిషేకం సందర్భంగా స్వామివారికి ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరాహస్వామివారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసి సంప్రోక్షణ చేసిన విషయం విదితమే. సంప్రోక్షణ చేసి మండలం (48 రోజులు) పూర్తయిన సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం, ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరిగింది. కాగా, తిరుమలలో సోమవారం నిర్వహించే రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top