
శాటిలైట్ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో బోరుబావుల తవ్వకాలు
లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను కనుగొనేందుకు బోరుబావుల తవ్వకాల ద్వారా ట్రయల్ రన్ ప్రారంభించారు. శాటిలైట్ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో ఈ తవ్వకాలకు నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. సుమారు 80–200 అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు. ఆ తర్వాత వాటి అడుగు భాగంలో డైనమైట్లు, జిలెటిన్ స్టిక్స్, మందుగుండు సామాగ్రి పంపి పేలుస్తున్నారు.
అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుళ్లవల్ల చుట్టుపక్కల వ్యవసాయ బోరుబావులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. రైతుల అనుమతుల్లేకుండా వారి పంట పొలాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదా.. లింగాల మండల కేంద్రంలోని ఎ.వి. శ్రీనివాసరెడ్డి పొలంలో అనుమతిలేకుండా తొమ్మిది బోరు బావులు తవ్వారు.
జిల్లా కలెక్టర్ అనుమతులతో ఓఎన్‌జీసీ సంస్థ బోరుబావులు తవ్వుతోందని తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చిన అనుమతుల కాపీని తనకు అందించారన్నారు. ఇక ముదిగుబ్బ నుంచి జమ్మలమడుగు వరకు బోరుబావుల తవ్వకాల కాంట్రాక్టును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ పొందినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment